ఏపీకి వర్ష సూచన
ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది
By Medi Samrat Published on 5 Nov 2024 7:03 PM ISTఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆగేయ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం మంగళవారం దక్షిణ మధ్య బంగాళాఖాతం, సగటు సముద్ర మట్టానికి 1.5 కిమీ ఎత్తులో విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి.
మంగళ, బుధువారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షం కురవనుంది. రాబోయే రెండు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో గురువారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో గురువారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.