ఆంధ్రప్రదేశ్ లో ఎండలు మండిపోతూ ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో కొద్దిగా ఉపశమనం కలిగించేలా వర్షాలు పడనున్నాయి. వాతావరణ శాఖ ఏపీలోని పలు జిల్లాల ప్రజలకు వర్ష సూచన చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అల్లూరి, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి , విశాఖ జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది. గత కొద్దిరోజులుగా మండే ఎండలకు తోడు వేడిగాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రాష్ట్రంలో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు వర్షాలు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ కేంద్రం అంచనా వేసింది. జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, బి.కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. గత రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన వర్షాలకు పంటలు నాశనం అయ్యాయి. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం 2000 ఎకరాలకు పైగా యాసంగి పంట దెబ్బతిన్నది. ఉరుములతో కూడిన జల్లులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేడి పరిస్థితుల నుండి ప్రజలకు ఉపశమనం కలిగించగలిగినప్పటికీ, రైతులు భారీ మూల్యం చెల్లించవలసి వచ్చింది.