నైరుతి రుతుపవనాలు సాధారణ తేదీ కంటే ఆరు రోజుల ముందుగానే దేశం మొత్తాన్ని కవర్ చేశాయని భారత వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఈరోజు రాజస్థాన్, హర్యానా, పంజాబ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో ముందుకు సాగాయి. దీంతో జూలై 8న మొత్తం దేశాన్ని కవర్ చేసే రుతుపవనాలు సాధారణ తేదీకి ఆరు రోజుల ముందే అంటే జూలై 2న దేశం మొత్తాన్ని కవర్ చేసిందని IMD ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు రుతుపవనాలు సాధారణం కంటే రెండు రోజుల ముందుగానే మే 30న కేరళలోకి, ఆరు రోజుల ముందుగానే ఈశాన్య ప్రాంతంలోకి వచ్చాయి.
ఇదిలావుంటే.. జూన్ 11 నుండి జూన్ 27 వరకు దేశంలో 16 రోజులపాటు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. జూన్ నెలలో సాధారణ వర్షపాతం 165.3 మిమీ కాగా.. 147.2 మిమీ వర్షపాతం నమోదైంది. ఇది 2001 నుండి ఏడవ అతి తక్కువ వర్షపాతంగా వాతావరణ శాఖ తెలిపింది. దేశంలో నాలుగు నెలల రుతుపవనాల సీజన్‌లో నమోదైన మొత్తం 87 సెంటీమీటర్ల వర్షపాతంలో జూన్ వర్షపాతం 15 శాతం కావడం విశేషం.
ఇక జూలైలో దేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవవచ్చని IMD సోమవారం అంచనా వేసింది. భారీ వర్షాల వల్ల పశ్చిమ హిమాలయ రాష్ట్రాలు, దేశంలోని మధ్య ప్రాంతాలలో నదీ పరివాహక ప్రాంతాలలో వరదలు సంభవించే అవకాశం ఉందని వెల్లడించింది.