ఆంధ్రప్రదేశ్ లో ఎండలు, ఉక్కపోతతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మార్చి నెలలో 38–42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణంకంటే 3–4 డిగ్రీలు అధికం. ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఎలా ఉంటాయోననే భయం ప్రజల్లో మొదలైంది. సోమవారం నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింతగా తీవ్రం కానున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాయలసీమలో వీటి తీవ్రత అధికంగా ఉండనుంది. రానున్న నాలుగు రోజులు వైఎస్సార్, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40–43 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోనూ 40–44 డిగ్రీలకు చేరుతుంది. ఆయా జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని, ఆ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పల్నాడు జిల్లాలో 40–42, ప్రకాశం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో 40–41 డిగ్రీల చొప్పున రికార్డయ్యే అవకాశం ఉంది.
రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల, అనంతపురం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు, కడప, తూర్పు గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో 41, నందిగామ, జంగమహేశ్వరపురం, విజయనగరం, ఏలూరు, పల్నాడు జిల్లాల్లో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.