తెలుగు రాష్ట్రాలకు అలర్ట్‌.. నేడు, రేపు భారీ వర్షాలు.. ఎల్లుండి నుంచి అతి భారీ వర్షాలు

అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

By -  అంజి
Published on : 24 Sept 2025 6:36 AM IST

IMD, heavy rains, Telugu states, low pressure, APSDMA, Telangana, APnews

తెలుగు రాష్ట్రాలకు అలర్ట్‌.. నేడు, రేపు భారీ వర్షాలు.. ఎల్లుండి నుంచి అతి భారీ వర్షాలు

హైదరాబాద్‌: అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఉదయం 8.30 గంటలలోపు వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్, వనపర్తి, గద్వాల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. మిగతా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 26 నుంచి రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్‌, సంగారెడ్డ, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు

ఉత్తర ఒడిశా,వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గురువారం ఏర్పడనున్న మరో అల్పపీడనం వీటి ప్రభావంతో ఆదివారం వరకు అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు, విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శుక్ర,శనివారాల్లో కోస్తాలో పలుచోట్ల అతిభారీవర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీవర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ఇప్పటి నుంచే రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.గురువారం నుంచి ఆదివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదన్నారు. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

Next Story