రాగల రెండు రోజుల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. సోమ, మంగళ వారాల్లో అసోం, మేఘాలయ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో సోమ, మంగళ వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఆయా రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు.
వచ్చే మూడు రోజులు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధితోపాటు ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, ములుగు, వరంగల్, నల్గొండ, మహబూబాబాద్, జగిత్యాల, వికారాబాద్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో వచ్చే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.