తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ హెచ్చరికలు జారీ చేసింది. డిపార్ట్‌మెంట్ సూచన ప్రకారం.. జూలై 10, గురువారం వరకు వాతావరణం ఇలాగే ఉంటుంది. జూలై 8–10 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. జులై 7న సోమవారం కూడా పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. జులై 10 వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, బలమైన ఉపరితల గాలులతో కూడిన భారీ వర్షాలు అవకాశం ఉందని అలర్ట్ చేసింది.
హైదరాబాద్ నగరం విషయానికొస్తే.. జూలై 10 వరకు ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ.. నగరానికి వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు.