తెలంగాణలో పోలింగ్ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ అంచనా వేసింది. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు పోలింగ్ రోజు మే 13న రాష్ట్రం మొత్తం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
అంతకుముందు తెలంగాణలో వేడిగాలుల పరిస్థితుల కారణంగా భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమయాన్ని ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఒక గంట పొడిగించింది. IMD హైదరాబాద్ తాజా అంచనా ప్రకారం.. సోమవారం రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇటీవల కురిసిన వర్షాల వల్ల తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత నాగర్‌కర్నూల్‌లో 33.7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. హైదరాబాద్, ఖైరతాబాద్‌లో కూడా ఉష్ణోగ్రత 36.1 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గింది.
తెలంగాణలో పోలింగ్ రోజున భారీ వర్షాలు కురుస్తాయని IMD హైదరాబాద్ అంచనా వేయడంతో.. ఇది రాష్ట్రంలోని ఓటింగ్ శాతాన్ని ఎలా ప్రభావితం చేస్తుందోనని ఆందోళన నెలకొంది.