తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు

కొన్ని రోజుల విరామం తర్వాత పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

By అంజి  Published on  6 Aug 2024 2:19 PM IST
IMD, Hyderabad, heavy rains, Telangana

తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు

కొన్ని రోజుల విరామం తర్వాత పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వానలు పడుతున్నాయి. హైదరాబాద్‌ నగరంలోనూ ఇవాళ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో వానలు పడుతున్నాయి.

తెలంగాణలో పలు చోట్ల నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్‌ తెలిపింది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. వర్ష సూచనల నేపథ్యంలో హైదరాబాద్ ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. తెలంగాణలోని వివిధ జిల్లాలకు రానున్న రెండు రోజుల పాటు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

హైదరాబాద్ విషయానికొస్తే, డిపార్ట్‌మెంట్ ఎల్లో అలర్ట్‌ను జారీ చేయడమే కాకుండా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన ఈదురు గాలులతో కూడిన జల్లులను కూడా అంచనా వేసింది. ఎల్లో అలర్ట్ రేపటి వరకు ఉన్నప్పటికీ, నగరంలో ఆగస్టు 10 వరకు వర్షపాతం కొనసాగే అవకాశం ఉంది.

Next Story