రుతుపవనాలు అక్కడికి వచ్చేశాయి

By Medi Samrat  Published on  20 May 2024 8:15 AM IST
రుతుపవనాలు అక్కడికి వచ్చేశాయి

బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, శుక్రవారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం నాడు తెలిపింది. మే 22- 23 తేదీల్లో పలు రాష్ట్రాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు/ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని సూచించారు. ఇక నైరుతి రుతు­పవనాలు ఆదివారం దక్షిణ అండమాన్‌ సముద్రంలోకి ప్రవేశించాయి. వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఇవి చురుగ్గా కదులుతూ దక్షిణ బంగాళాఖాతం, నికోబార్‌ దీవులు, మాల్దీవులు, కొమరిన్‌లోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయి. . రుతు పవ­నాలు మే 31న కేరళను తాకనున్నట్లు భారత వాతా­వరణ విభాగం అంచనా వేస్తోంది.

లా నినా పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా ఉండటంతో ఈ ఏడాది సాధారణంగా కంటే ఎక్కువగానే వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు తెలంగాణ, రాయలసీమల మీదుగా సముద్ర మట్టానికి 3.1 కి.మీల ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడింది. ప్రస్తుతం రాష్ట్రంపైకి ఆగ్నేయ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. దీంతో మూడ్రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం నాడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణాలలో వర్షం కురిసే అవకాశం ఉంది. గంటకు 30–40 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Next Story