దంచికొడుతున్న వానలు.. రెండు రోజులు స్కూళ్లకు సెలవులు
Holidays For Schools Due To Rain In AP. కడప జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో ఏకధాటిగా వర్షాలు
By Medi Samrat Published on 18 Nov 2021 7:56 AM GMTకడప జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో ఏకధాటిగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది వాతావరణ శాఖ. దీంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు కలెక్టర్. ఇవాళ, రేపు(18, 19 తేదీలు) రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవులిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలావుంటే.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 12 గంటల్లో వాయుగుండంగా మారనుంది.
రాబోయే 24 గంటల్లో నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి 40 నుంచి 60 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విపత్తుల శాఖ కమిషనర్ హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలం పనులు చేసుకునే రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదిలావుంటే.. అల్పపీడనం ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలిపిరి నడకమార్గం, కనుమదారుల్లో వరద నీటితో పోటెత్తుతున్నది. అటవీప్రాంతం భారీగా వస్తున్న వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. నీటి ప్రవాహంతో మెట్లమార్గం జలపాతంలా కనిపిస్తున్నది. ఇప్పటికే ముందు జాగ్రత్తలు తీసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం నడకదారిని మూసివేసింది.
ఇక చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కల్యాణి జలాశయం పూర్తి నీటిమట్టానికి చేరుకుంది. పాలసముద్రంలో వెంగళరాజకుప్పం చెరువు ఉధృతంగా ప్రవహిస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం నవంబర్ 19వ తేదీన పాఠశాలలకు సెలవు ప్రకటించింది.