హైదరాబాద్‌లో భారీ వర్షం
భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసినట్లుగా శుక్రవారం నగరంలో మరోసారి భారీ వర్షం కురిసింది.
By Medi Samrat
భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసినట్లుగా శుక్రవారం నగరంలో మరోసారి భారీ వర్షం కురిసింది. సాయంత్రం కురిసిన వర్షానికి నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఉదయం వర్షం కాస్త తెరిపిచ్చినప్పటికీ సాయంత్రానికి భారీ వర్షం కురిసింది. లింగంపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, ఖైరతాబాద్, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. ఆఫీస్‌ల నుంచి బయటకు వచ్చే సమయం కావడంతో ట్రాఫిక్ జామ్ అయింది.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సెప్టెంబర్ 9 వరకు హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని పలు నగరాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
కుండపోత వర్షాల కారణంగా ఇప్పటికే హైదరాబాద్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. వర్షాలు కారణంగా ఈ వారంలోనే 16 మంది మరణించారు. వందలాది మందిని వరద ప్రభావిత ప్రాంతాల నుండి సురక్షిత ప్రదేశాలకు తరలించారు.