ఎల్లో అలెర్ట్ జారీ.. తెలంగాణలో రాబోయే 4 రోజులు భారీ వర్షాలు
Heavy rains in Telangana in next 4 days. హైదరాబాద్ నగరంలో బుధవారం తెల్లవారుజామున ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది
By Medi Samrat Published on 4 May 2022 7:15 PM ISTహైదరాబాద్ నగరంలో బుధవారం తెల్లవారుజామున ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మొత్తం 63.1 మిమీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయం కనిష్ట ఉష్ణోగ్రత 19.6 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. రాబోయే 4 రోజుల పాటు తెలంగాణలోని కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నందున రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD)-హైదరాబాద్ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లోని ప్రదేశాలలో ఉరుములు ,మెరుపులు, ఈదురు గాలులు (30-40 kmph) వేగంతో వర్సాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, కుమురం భీమ్ ఆసిఫాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మంచిర్యాలు, మేడ్చల్-మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, జైశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌లు ప్రకటించారు.
తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన వరి పంటలు నీటిమట్టమయ్యాయి. పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వరి కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన వరి పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలో కురిసిన ఆకస్మిక వర్షం కారణంగా వరితో పాటు విద్యుత్ స్తంభాలు, పిపిసిల వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లు కూడా దెబ్బతిన్నాయి. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రం, జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాంనూర్, ఖిలావనపర్తి, నర్సింహులపల్లి, ధర్మారం మండల కేంద్రం, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలోని పీపీసీల్లో నిల్వ చేసిన వరి పంట వర్షం కారణంగా తడిసింది. కొంత మంది రైతులు టార్పాలిన్‌లు వేసి తమ పంటను కాపాడుకోగా, కొన్ని వరిపంటలు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి.