నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
By అంజి Published on 9 Jun 2024 12:55 AM GMTనేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం,మన్యం,అల్లూరి, కర్నూలు,నంద్యాల,అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములతో వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు,పశు-గొర్రెల కాపరులు చెట్లు, క్రింద,బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించింది.
రుతుపవనాల, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజుల పాటు ఏపీలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం ప్రకటించింది. శనివారం ఏపీలోని పలు జిల్లాల్లో వానలు కురిశాయి. రానున్న రెండు రోజుల్లో నైరుతు రుతుపవనాలు శ్రీకాకుళాన్ని తాకనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
అటు తెలంగాణలో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావణ కేంద్రం అంచనా వేసింది. ఈ నెల 10, 11న నిర్మల్, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.