ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడిందని అధికారులు తెలిపారు. మరో 24 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండగా మారే సూచనలు కనబడుతున్నాయి. అయితే ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు వైపు కదిలే ఛాన్స్ ఉందని వెదర్ రిపోర్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో రేపటి నుండి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని అధికారులు వెల్లడించారు.నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు పడే ఛాన్స్ కనిపిస్తోంది.
వాయుగుండగం తీరం దాటేటప్పుడు, తీరం వెంబడి గంటకు 45 - 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలపడంతో పలు జిల్లాల రైతులు తమకు పంట నష్టం జరుగుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం నవంబర్‌లో ఏపీ రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించాయి. చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాలో వరదలు పోటెత్తాయి. అప్పుడు వాయుగుండం కారణంగా భారీ వర్షాలకు రాష్ట్రంలో 24 మంది మృతి చెందారు.