భాగ్యనగరం లోని పలుప్రాంతాలను వరుణుడు పలకరించారు. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. నిజాంపేట, ప్రగతినగర్, రాజేంద్రనగర్, శంషాబాద్, కిస్మత్‌పురా, బండ్లగూడ జాగీర్, హైదర్షాకోట్, గండిపేట్‌లో వాన కురిసింది. బేగంబజార్, ఏంజే మార్కెట్, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, హిమాయత్ నగర్, నారాయణగూడ, లిబర్టీ పరిసర ప్రాంతాల్లో వానపడింది. పలుచోట్ల ఈదురు గాలులతో ఓ మోస్తరు వర్షం కురిసింది.
రాబోయే మూడు రోజులపాటు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే సూచించింది. ఉపరితల ఆవర్తనం ఝార్ఖండ్ పరిసరాల్లో కొనసాగుతున్నది, సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఝార్ఖండ్ పరిసరాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది.