ఆగస్టు 8, 9 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమై రిజర్వాయర్లలో నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే జులై నెలలో రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురిశాయి. రెడ్ అలర్ట్ ప్రకారం.. ఈ నెల 8, 9 తేదీల్లో ఆదిలాబాద్, నిజామాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఆగస్టు 8న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తదుపరి రెండు రోజులు(10, 11 తేదీలు) పెద్ద మార్పు ఉండదని IMD సూచన. ఇదిలావుంటే.. రాబోయే 24 గంటల్లో హైద్రాబాద్ నగరంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.