అల్పపీడనం ఎఫెక్ట్..తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి
By - Knakam Karthik |
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం.. నేడు వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెలంగాణలో మరో మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 25 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. వాతావరణశాఖ హెచ్చరికలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఏపీలోనూ భారీ వర్షాలు
ఇక ఏపీలో ఇవాళ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇవాళ ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలోని భవనాలు వద్ద ఉండరాదని, సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు అని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.