రాబోయే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, కేంద్ర పాలిత ప్రాంతం యానాంకు వరద హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశముందని విశాఖ వాతావరణకేంద్రం తెలిపింది.
గురువారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విజయనగరం, నంద్యాల, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గడచిన 24 గంటల్లో ఏలూరులో 22, ముమ్మిడివరంలో 18, అమలాపురంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కళింగపట్నం, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో ప్రమాద సూచికను ఏగురవేశారు. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా నది పరివాహక, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.