ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో శుక్రవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి 35-55కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని హెచ్చరించింది.
అటు తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
దక్షిణ భారతంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీంతో ఏపీ, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, కరైకల్, కర్ణాటక, కేరళ, మహే వాతావరణ సబ్ డివిజన్లలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళల్లో 24 గంటలుగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది రేపటిలోపు అల్పపీడనం ఏర్పడి, 48 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.