Cyclone Senyar : 'సెన్యార్' తుఫాను వచ్చేస్తుంది..!
By - Medi Samrat |
బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం రాగల కొన్ని రోజుల్లో తుఫానుగా మారే అవకాశం ఉంది. మలక్కా జలసంధి, దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా బలపడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపానుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించిన 'సెన్యార్' అనే పేరును ఖరారు చేయనున్నారు. అరబిక్ భాషలో 'సెన్యార్' అంటే 'సింహం' అని అర్థం. అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణిస్తూ నవంబర్ 24 నాటికి దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు.
వాయుగుండంగా మారిన తర్వాత, కేవలం 48 గంటల వ్యవధిలోనే ఇది మరింత బలపడి తుపానుగా రూపాంతరం చెందుతుందని స్పష్టం చేశారు. ఈ వాతావరణ మార్పులను తాము నిశితంగా గమనిస్తున్నామని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. ఈ వ్యవస్థ వాయుగుండంగా మారిన క్షణం నుంచి ప్రతి 6 గంటలకు ఒకసారి, తుపానుగా రూపాంతరం చెందిన తర్వాత ప్రతి 3 గంటలకు ఒకసారి ప్రత్యేక బులెటిన్లను విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతానికి ఇవి ప్రాథమిక హెచ్చరికలు మాత్రమేనని, తుపాను తీరం దాటే ప్రదేశం, సమయంపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుందని అన్నారు. తుఫాను ప్రభావంతో నవంబర్ 27 వరకు అండమాన్, నికోబార్ దీవుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మత్స్యకారులు తక్షణమే సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.