బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే మూడు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలోని 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది. అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అటు ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఒంగోలు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయంది. శ్రీకాకుళం, తూర్పు గోదావరి, వైఎస్‌ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.