ఉపరితల ఆవర్తనం కారణంగా ఇవాళ, రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, ,గద్వాల్, నారాయణపేట జిల్లాలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఇక మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు రెండు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రానికి రానున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావంతో నాలుగు రోజులు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్‌ఆర్ కడప, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. మిగతా చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని వెల్లడించింది.