ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ దక్షిణమధ్య బంగాళాఖాతం, పశ్చిమమధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
రేపు శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శనివారం సాయంత్రం 5 గంటలకు విజయనగరం(జి) నెల్లిమర్లలో 49.7మిమీ, కృష్ణా(జి) ఘంటసాలలో 44.7మిమీ, తిరుపతి(జి) 27.7మిమీ వర్షపాతం నమోదైందని తెలిపారు.