బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే రానున్న 48 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయుగుండం ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా మారడంతో సముద్రం అల్లకల్లోలంగా మారనుంది.
మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర వెంబడి కొనసాగుతుందని, అందుకే రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఈరోజు, రేపు కురిసే అవకాశం ఉందన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా విశాఖపట్నంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అదేవిధంగా కర్నూలు, ప్రకాశం, నంద్యాలతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది.