నిండుకుండలా హుస్సేన్ సాగర్.. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Aug 2020 5:58 AM GMT
నిండుకుండలా హుస్సేన్ సాగర్.. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ

హైదరాబాద్ : ఇటీవల కురుస్తున్న వర్షాలకు భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ జలాశయం పూర్తిగా నిండింది. ఎగువ నుంచి వరద నీరు జలాశయంలోకి వస్తుండడంతో పూర్తిగా నిండింది. హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా.. ఆదివారం జలాశయం నీటినిల్వ 513.64 మీటర్లకు చేరింది.

హోటల్ మారియట్ వద్ద ఉన్న చివరి గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. 514.91 మీటర్ల నీటిమట్టం వరకు తట్టుకునేలా హుస్సేన్ సాగర్‌ను డిజైన్ చేశారని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. సాగర్ పరిసర ప్రాంతాల్లో నివసించే వారు ఇతర ప్రాంతాలకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు అప్రమత్తం చేశారు.

అశోక్ నగర్, హబ్సిగూడ, నల్లకుంట ఏరియా లోకి వరద నీరు వెళ్లే అవకాశాలున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాలువ వెంట ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నగరవ్యాప్తంగా మాన్సూన్ ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ బృందాలు, అధికారులను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది.

హుస్సేన్ సాగర్‌లో వరద పరిస్థితిని జీహెచ్ఎంసీ లేక్స్ వింగ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. మరో మూడు రోజులు పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టింది. కొన్ని దశాబ్దాల క్రితం హుస్సేన్ సాగర్‌కు 21 గేట్లను అమర్చారు.

జలాశయం పూర్తి స్థాయిలో నిండితే గేట్లను తెరిచి నీటిని వదులుతారు. వర్షం తగ్గే కొద్దీ హుస్సేన్ సాగర్ లో నీటి మట్టం తగ్గేలా గేట్లను తెరచి ఉంచనున్నారు. అలుగులు, తూముకు అడ్డుపడుతున్న చెత్తాచెదారాన్ని ప్రత్యేక యంత్రాలు, సిబ్బందితో ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉన్నారు.

Next Story