కోటి లంచం కథ : అసలేందీ రాంపల్లి భూవివాదం?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Aug 2020 7:44 AM GMT
కోటి లంచం కథ : అసలేందీ రాంపల్లి భూవివాదం?

ఒక భూమికి సంబంధించిన వివాదాన్ని లెక్క తేల్చేందుకు కీసర ఎమ్మార్వో రూ.1.10కోట్ల మొత్తాన్ని లంచంగా తీసుకుంటున్న వేళ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవటం తెలిసిందే. ఇంత భారీ మొత్తాన్ని ఒకేసారి పట్టుకోవటం ఇదే తొలిసారిగా ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారం ఏమిటి? ఈ ల్యాండ్ వెనకున్న అసలు వివాదం ఏమిటి? అసలేం జరిగిందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఇష్యూ మొత్తానికి రాంపల్లి గ్రామంలోని భూములుగా చెప్పాలి. సదరు వివాదంలోకి వెళితే.. అక్కడి వారు చెబుతున్న సమాచారం ప్రకారం.. రాంపల్లిలోని సర్వే నెంబరు 607 నుంచి 607 వరకు.. అదే విధంగా సర్వే నెంబరు 610 నుంచి 613లకు సంబంధించి 33 ఎకరాల భూమి ఉంది. అంతేకాదు.. సర్వే నెంబరు 614లో మరో 11 ఎకరాల భూమి ఉంది. మొత్తం 44 ఎకరాల భూమికి సంబంధించి వేల్పుల కుటుంబ వారసులు ఈనాం పట్టాదారుగా ఉన్నారు. అదే సమయంలో సర్వే నెంబరు 608.. 609లకు సంబంధించి మరో తొమ్మిది ఎకరాలు ఉంది.

దాదాపు ఇరవైనాలుగేళ్ల క్రితం అంటే.. 1996లో అప్పటి రంగారెడ్డి జిల్లా తూర్పు ఆర్డీవో ఒకరు వేల్పుల కుటుంబానికి 16 ఎకరాలకు సంబంధించి ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికేట్ ను జారీ చేశారు. మిగిలిన భూములకు సంబంధించి సీసీఎల్ ఏకు లేఖ రాశారు. అయితే.. దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్ లో పెట్టేశారు.

ఈ వివాదం ఇలా ఉండగా.. 2004లో కొందరు వ్యక్తులు ఆ మొత్తం 44 ఎకరాలు తమవేనని సీసీఎల్ వద్ద కేసు వేశారు. ఇదిలా ఉంటే.. కేసులు వేసిన వారికి సీసీఎల్ లోని ఒక ఉన్నతాధికారి భూములు కట్టబెట్టారు. దీంతో ఉలిక్కిపడిన వేల్పుల కుటుంబీకులు 2005లో హైకోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయించిన వేల్పుల కుటుంబీకులు దాదాపు 38 మంది వరకు ఉండటం గమనార్హం.

ఈ కేసును విచారించిన కోర్టు.. తక్షణం.. యథాతధ స్థితిని ఉంచాలని స్టే ఇచ్చింది. ఈ వివాదం ఇప్పటికి లెక్క తేల్లేదు. ఇదిలా ఉండగా.. తాజాగా పెరిగిన ధరల నేపథ్యంలో కొత్త అంకానికి తెర తీశారు. కొందరు వ్యక్తులు ఈ భూమి మీద కన్నేసి.. స్థిరాస్తి వ్యాపారులు.. దళారులు కలిసి భూముల్నితమ సొంతం చేసుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే 44 ఎకరాలకు సంబంధించి 19.39 ఎకరాల భూమికి సంబంధించి పాసుపుస్తకాలు తీసుకునేందుకు వీలుగా తహసీల్దారుకు రూ.1.10 కోట్ల మొత్తాన్ని తొలి విడతగా లంచం ఇచ్చేందుకు డీల్ కుదుర్చుకున్నారు.

పని పూర్తిగా అయ్యాక అనుకున్నవిధంగా మిగిలిన మొత్తాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడి చేయటంతో ఈ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. ఒకవేళ.. ఈ వ్యవహారం కానీ బయటకు రానట్లైయితే.. భూముల్ని తమ పేరుతో పాస్ పుస్తకాలు వచ్చిన తర్వాత బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు పొందాలన్నది ప్లాన్ అంటున్నారు. ఈ భూమి విలువ దాదాపు రూ.60 కోట్ల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

Next Story