బిల్డింగ్ కట్టుకోవాలంటే స్క్వేర్ ఫీట్‌కు 75 రూపాయలు లంచం కట్టాలని డిసైడ్ చేశారు : ఈటల

స్వయంగా మోదీ, అమిత్ షానే రేవంత్ డబుల్ ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని చెప్పి పోయారంటే.. ఏంజరుగబోతుందో అర్థం చేసుకోండని ఈటల రాజేందర్ అన్నారు

By Medi Samrat  Published on  21 May 2024 1:36 PM IST
బిల్డింగ్ కట్టుకోవాలంటే స్క్వేర్ ఫీట్‌కు 75 రూపాయలు లంచం కట్టాలని డిసైడ్ చేశారు : ఈటల

స్వయంగా మోదీ, అమిత్ షానే రేవంత్ డబుల్ ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని చెప్పి పోయారంటే.. ఏంజరుగబోతుందో అర్థం చేసుకోండని ఈటల రాజేందర్ అన్నారు. వరంగల్ హరిత హోటల్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ లో బిల్డింగ్ కట్టుకోవాలి అంటే స్క్వేర్ ఫీట్‌కు 75 రూపాయలు లంచం కట్టాలని డిసైడ్ చేశారట.. రేవంత్ అతితక్కువ కాలంలో అతి ఎక్కువ ఇల్లీగల్ డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు.

కాలేజీ యాజమన్యాలను బెదిరిస్తున్నారట.. నువ్వెంత నీ బ్రతుకెంత. ప్రజలు బిక్షపెడితే నీకు పదవివచ్చింది. ఈ విషయం మర్చిపోతే కాలగర్భంలో కలిసిపోతారని ఫైర్ అయ్యారు. ప్రజలు దెబ్బకొడితే మళ్ళీ లేవరు.. కేసీఆర్ లేస్తున్నాడా.? అని ప్ర‌శ్నించారు. తాటాకు చప్పుళ్లకు భయపడవద్దు.. ఇది వరంగల్.. అని శ్రేణుల‌కు ధైర్యం చెప్పారు. సీఎంది నాలుకనా.. తాటిమట్టన.. పెద్దన్న అని పొగుడుతారు.. మళ్లీ మూడు రోజులకే హంతకుడు అని మాట్లాడతారు అని అన్నారు.

ఎన్నికలు వచ్చినప్పుడే ప్రభుత్వానికి టీచర్ల, నిరుద్యోగుల, కాలేజీల, స్కూల్స్ సమస్యలు గుర్తుకువస్తాయి. రూ.7500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బాకీ ఉంది. చెల్లించే నిజాయితీ ఉందా.? అని ప్ర‌శ్నించారు. లక్షల మంది పిల్లల ఫీజులు చెల్లించే ఫీజు రీయింబర్స్మెంట్ ప్రియారిటీనా.. కాంట్రాక్టర్స్ కి బిల్లులు చెల్లించడం ప్రియరిటీనా ? చిత్తశుద్ది ఉంటే బకాయిలు చెల్లించి ఓట్లు అడగండన్నారు.

నిరుద్యోగులకు నెలకి నాలుగువేల రూపాయలు భృతి ఇస్తామని ప్రియాంకా గాంధీతో చెప్పించారు కదా ఆరునెలలు అయినా ఆ ఊసే లేదన్నారు. ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. 2023 జూలై లో కొత్త PRC రావాలి.. జోషి కమిటీ రిపోర్ట్ గురించే పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ వారు ప్రేమకు లొంగుతారు తప్ప దబాయింపుకి కాదని కాంగ్రెస్ వారు గుర్తుపెట్టుకోవాలన్నారు. కేసీఆర్ పాలనలో ఆత్మగౌరవానికి దెబ్బ తగిలింది కాబట్టే బండకేసి కొట్టారు. మీకు కూడా ఇది తప్పదన్నారు. అధికార పార్టీ వారిని గెలిపిస్తే పిల్లి లెక్కనే ఉంటారు. అందరూ నాలాగే కొట్లాడే వారు ఉండరు. అందుకే ప్రశ్నించే గొంతు ప్రేమేందర్ రెడ్డిని గెలిపించండన్నారు.

Next Story