కలకలం సృష్టిస్తున్న బావిలో 9 మృతదేహాలు
By సుభాష్ Published on 22 May 2020 8:09 AM GMTవరంగల్‌లో బావిలో బయటపడ్డ 9 మృతదేహాల ఘటన కలకలం రేపుతోంది. గురువారం బావిలో ఒకే కుటుంబానికి చెందిన నాలుగు మృతదేహాలు లభ్యం కావడంతో పశ్చిమబెంగాల్‌కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. లాక్‌డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావించారు. అయితే అదే బావిలో మరో ఐదు మృతదేహాలు లభ్యం కావడం సంచలనంగా మారింది. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెలకుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అయితే గురువారం నాలుగు మృతదేహాలు, శుక్రవారం మరో ఐదు మృతదేహాలను గుర్తించారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురున్నారు. వీరిది హత్యలా..? లేక ఆత్మహత్యలా ..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతులు ఎండీ మక్సూద్ (50), ఆయన భార్య నిషా (45), కుమార్తె బుస్ర (20), మరో మూడేళ్ల మనవడిగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ రోజు లభ్యమైన శవాల్లో మృతదేహాల్లో మక్సూద్ (22), బీహార్‌కు చెందిన కార్మికుడు శ్రీరామ్‌గా గుర్తించారు.
ఘటన స్థలానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్, వరంగల్ సీపీ రవీందర్, మేయర్ ప్రకాశ్ రావు, కలెక్టర్ హరితలు వచ్చి పరిశీలించారు. మరో మృతదేహం వివరాలు తెలియాల్సి ఉంది. ఎండీ మక్సూద్ 20 ఏళ్ల క్రితం పశ్చిమబెంగాల్ నుంచి బతుకుదెరువు కోసం వరంగల్‌కు కుటుంబంతో సహా వలస వచ్చారు. వీరు తొలుత కరీమాబాద్ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉండేవారు. కాగా, డిసెంబరు నుంచి గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలోని ఓ గన్నీ సంచుల తయారీ గోదాంలో పనిచేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా వరంగల్ నుంచి రాకపోకలకు ఇబ్బందిగా ఉండటంతో.. నెలన్నర నుంచి గోదాంలోనే ఉన్న రెండు గదుల్లో మక్సూద్‌తో పాటు ఆయన భార్య, ఇద్దరు కుమారులు ఉంటున్నారు. భర్తతో విడిపోయిన కుమార్తె బుస్ర కూడా తన మూడేళ్ల కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది.
వీరి కుటుంబంతోపాటు బీహార్‌కు చెందిన యువకులు శ్రీరాం, శ్యాం కూడా అదే ఆవరణలోని మరో గదిలో నివసిస్తూ గోదాంలో పనిచేస్తున్నారు. పరిశ్రమ యజమాని సంతోష్ రోజూలాగే గురువారం మధ్యాహ్నం గోదాంకు వచ్చేసరికి కార్మికులెవరూ కనిపించకపోవడంతో పరిసరాల్లో గాలింపు చర్యలు చేపట్టగా, పక్కనే ఉన్న పాడుబడ్డ బావిలో చూడగా నాలుగు మృతదేహాలు నీళ్లలో తేలుతూ కనిపించాయి. వెంటనే గీసుకొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులతోపాటు క్లూస్ టీమ్, డాగ్ స్వ్కాడ్ సిబ్బంది వచ్చి ఆధారాలు సేకరించారు.
వరంగల్ నగరపాలక సంస్థ సిబ్బంది.. విపత్తు నిర్వహణ బృంద సభ్యులు, పోలీసులు కలిసి మృతదేహాలను తాళ్లతో వెలికి తీశారు. శుక్రవారం ఉదయం మరో 5 మృతదేహాలను గుర్తించగా, మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో ఆత్మహత్యగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. బావిలో ఇలా మొత్తం 9 మృతదేహాలు లభ్యం కావడంపై అధికారులకు అంతుబట్టడం లేదు.