'చిలకా' గుట్టు విప్పిన విశాఖ కుర్రాళ్లు..!
By అంజి
విశాఖ: అది బారువ తీరం.. అటుగా పడవలు కూడా వేళ్లేవి కావని.. ఉవ్వెత్తున సముద్ర తరంగాలు ఎగసిపడేవి. సముద్రంలోని ఓ కర్ర.. బీచ్ దగ్గరకు వచ్చే పర్యాటకులకు ఓ సందేహంగా మారింది. శ్రీకాకుళం జిల్లాలో ఈ తీరానికి వచ్చే ప్రజలకు ఆ కర్ర ఏమిటీని కొన్ని సంవత్సరాల వరకు ప్రశ్నగానే ఉండిపోయింది. తాజాగా ఆ కర్ర రహస్యాన్ని విశాఖ జిల్లాకు చెందిన లివిప్ అడ్వెంచర్స్ స్కూబా డైవింగ్ బృందం చేధించింది. అక్కడి తీర సమీపంలో ఎప్పుడో వందల ఏళ్ల క్రితం చిలకా అనే పేరు గల ఓ పెద్ద నౌక మునిగిపోయింది. అక్కడి వెళ్లేందుకు ఎంతో మంది సాహసం చేసి చనిపోయారని స్థానికులు చెప్పుకుంటారు. అయితే కొందరు సుడిగుండాల భయంతో అక్కడి వెళ్లేందుకు సాహసించలేదు.
తాజాగా అక్కడి సుడిగుండాలు వెనుక ఉన్న అద్భుత రహస్యాన్ని స్కూబా డైవింగ్ బృందం కనిపెట్టింది. ఈ నెల 27న బారువ సముద్ర తీరంలో ముగ్గురు స్కూబా డైవర్‌లు పరిశోధనా ప్రారంభించారు. ఇన్‌స్ట్రక్టర్ బలరాం నాయుడు, డైవ్ మాస్టర్ రాహుల్, అడ్వాన్స్ డైవర్ లక్ష్మణ్ ఈ అన్వేషణనలో పాలు పంచుకున్నారు. తీరానికి 400 మీటర్ల దూరంలో ఉన్న కర్ర వద్దకు చేరుకున్నారు. సముద్ర గర్భంలోని 7 మీటర్ల లోతు వెళ్లాక వారికి నౌక ఆనవాళ్లు కనిపించాయి.
దాదాపు 45 నిమిషాల పాటు సాగర గర్భంలో ఉండి నౌక విశేషాలను గుర్తించారు. దాదాపు 500 మీటర్ల వెడల్పులో నౌక అవశేషాలు చెల్లా చెదురుగా పడి ఉన్నట్లు గుర్తించారు. శిథిలావస్థలో ఉన్న ఆ నౌకలో గోలియత్ గ్రూపర్, సిల్వర్ మునీ, లయన్ ఫిష్‌తో పలు జలజీవులు నివాసమున్నట్లు తెలిపారు. నౌక వెనుకభాగం పైకి ఉందని, అల ఉండటం వల్ల అలలు వచ్చినప్పుడు సూడిగుండాలు ఏర్పడినట్లు కనపిస్తుందని స్కూబా డైవర్లు తెలిపారు. అయితే ఆ ప్రాంతం చాలా ప్రమాదకరమని కూడా చెప్పారు.
నౌక పూర్తిగా శిథిలమైందని లివిన్ అడ్వెంచర్ సంస్థ ఇన్‌స్ట్రక్టర్ బలరాం నాయుడు తెలిపారు. అలల అలజడి ఎక్కువగా ఉండడంతో నౌక వెడల్పు కోలవలేకపోయామన్నారు. గతంలో తమ బృందం విజయనగరంలోని చింతపల్లి తీరం, భీమిలి తీరంలో మునిగిన నౌకలను అన్వేషించిందని బలరాం నాయడు తెలిపారు. విశాఖకు చెందిన ఈ స్కూబా డైవర్స్‌కు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగోంది. మన దేశంలో మునిగిపోయన నౌక అవశేషాలను గుర్తించడం ఇదే మొదటిసారని ఈ బృందం తెలిపింది.
చిలకా షిప్ విశేషాలు:
బ్రీటిష్ ఇండియా నేవిగేషన్ కంపెనీకి చెందిన ఈ చిలకా నౌక కాకినాడ నుంచి మద్రాసు మీదుగా రంగూన్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో నౌకలో దాదాపు 1600 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వారిని రక్షించే ప్రయత్నంలోనే నౌక కెప్టెన్ కొంత వెనుక భాగాన్ని సముద్రంలో మునిగిపోయేలా చేశారు. ఈ ప్రమాదంలో దాదాపు 81 మంది చనిపోయారు. 1917-7-1వ తేదీన చిలకా నౌక సముద్రంలో మునిగిపోయింది.