కునాల్ పై నాలుగు ఎయిర్‌లైన్స్‌ నిషేధం

By అంజి  Published on  30 Jan 2020 1:57 AM GMT
కునాల్ పై నాలుగు ఎయిర్‌లైన్స్‌ నిషేధం

ఢిల్లీ: ప్రముఖ స్టాండప్ కమేడియన్ కునాల్ కామ్రపై ఇండిగో ఎయిర్‌లైన్స్ నిషేధంపై వివాదం పెరుగుతోంది. ఫ్లైట్‌లో ఎదురుపడిన రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ ఆర్నాబ్‌ గోస్వామిని హేళన చేశారన్న ఆరోపణలపై కునాల్‌ కామ్ర మీద ఇండిగో విమానయాన సంస్థ నిషేధం విధించింది. వెంటనే ఎయిర్‌ ఇండియా విమాన సర్వీసుల్లో కూడా ఆయన్ను అనుమతించబోమని ఆ సంస్థ అధికార ప్రతినిధి ప్రకటించారు. ఇదే బాటలో సాగుతూ స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థ కూడా అతన్ని బహిష్కరించింది. ఇక మిగతా విమాన సర్వీసుల కూడా కునాల్‌ కామ్రపై నిషేధం విధించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి పిలుపునిచ్చారు. దీంతో ఇప్పుడు ఈ వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ వంటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ సైతం స్పందించారు.



కునాల్ కామ్రపై నాలుగు ఎయిర్‌లైన్స్ నిషేధం విధించడం ఓ పిరికి పంద చర్య. తమ పరపతి, ప్రాబల్యాన్ని ఉపయోగించి ఓ విమర్శకుడి గొంతు నొక్కేస్తున్నారు. రోజంతా అసత్య వార్తలను ప్రసారం చేసే వారు తిరిగి తమను ప్రశ్నిస్తే వెన్నెముక లేని వారిలా ప్రవర్తించారంటూ ట్వీట్ చేశారు. అయితే అన్ని ఎయిర్లైన్స్ నిషేధాలను కునాల్ కామిడీ గా రియాక్ట్ అయ్యారు. తనను నిషేధించిన ప్రతీ ఎయిర్లైన్స్ పోస్ట్ కు కునాల్ థాంక్స్ అంటూ స్పందించారు. అంతేకాదు మోడీజీ నేను రోడ్లపై నడవటానికి అర్హుడినేనా అంటూ ట్వీట్ చేశారు.



వివాదానికి కారణం ఏంటంటే

2016 జనవరిలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో కుల వివక్ష వల్ల ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్‌ వేముల తల్లి రాధికా వేములను ఉద్దేశించి ఆర్నాబ్‌ స్వామి తన డిబేట్ షోలో తన కులం ఏమిటంటూ ఆమెను అవమానించారు. దీన్ని మనసులో పెట్టుకున్న కునాల్, విమానంలో ఆర్నాబ్‌ కనిపించగానే ఈ విషయమై నిలదీశారు. దానికి అర్నాబ్ స్పందించకుండా చెవుల్లో ఇయర్‌ ఫోన్స్ పెట్టుకొని లాప్‌టాప్‌తో బిజీ ఉండేందుకు ప్రయత్నించారు. అర్నాబ్ జాతీయవాదాన్ని సైతం నిలదీస్తూ కునాల్ మాట్లాడిన వీడియో ఒకటి వైరల్‌ అవడంతో కునాల్‌పై ఈ చర్యలు తీసుకున్నారు. అయితే కునాల్‌ తన కామిడీ షోలలో అధికార పక్షంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నందుకే ఈ చర్య తీసుకున్నారని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు.



Next Story