విశాఖకు ఆ ముప్పు పొంచి ఉందా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Aug 2020 1:56 PM IST
విశాఖకు ఆ ముప్పు పొంచి ఉందా?

లెబనాన్ రాజధాని బీరుట్ నగరంలో చోటు చేసుకున్న భారీ పేలుడు కారణంగా చోటు చేసుకున్న ప్రాణ నష్టం.. ఆస్తినష్టం చూస్తే.. గుండెలు అదిరిపోవాల్సిందే. ఇక.. పేలుడు సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు షాకింగ్ గా మారటం ఖాయం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరేదో చెప్పినా.. ఇదంతా కూడా భారీ ఎత్తున నిల్వ ఉంచిన ఆమ్మోనియం నైట్రేట్ రసాయనం కారణంగా చోటు చేసుకున్న పేలుడుగా గుర్తించటం తెలిసిందే.

బీరుట్ నౌకాశ్రయం వద్ద నిల్వ ఉంచిన భారీ రసాయనం పొరపాటున పేలటంతో దారుణమైన విద్వంసం చోటు చేసుకుంది. దీంతో.. ఈ రసాయనం కారణంగా మన దేశానికి ఎంతమేర ముప్పు పొంచి ఉందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే.. భారతదేశం మొత్తమ్మీదా ఆమ్మోనియం నైట్రేట్ దిగుమతి చేసే ఏకైక ప్రాంతం ఏపీలోని విశాఖనగరంగా తేల్చారు. ఇటీవల కాలంలో ఏదో ఒక ప్రమాదంతో ఈ ఉక్కునగరం తరచూ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆ మధ్యన లీకైన గ్యాస్.. ఆ తర్వాత చోటు చేసుకున్న అగ్నిప్రమాదాలు.. పేలుళ్లు.. ఇటీవల భారీ క్రేన్ కూలిపోవటం లాంటి ఉదంతాలతో తరచూ ఏదో ఒక ప్రమాదంతో విశాఖ పేరు కలిసి వినిపిస్తోంది.

ఇలాంటివేళ.. అమ్మోనియం నైట్రేట్ లాంటి ప్రమాదకరమైన రసాయనం దేశం మొత్తమ్మీదా విశాఖలో మాత్రమే నిల్వ ఉంచుతారని.. మరెక్కడా ఉంచర‌న్న మాట తాజాగా వెల్లడైంది. గతంలో కొన్ని ఓడరేవుల వద్ద ఉంచినా.. ఏ మాత్రం నిర్లక్ష్యం జరిగినా పెను ప్రమాదం పొంచి ఉంచటంతో.. అన్నింటి వద్ద ఆపేసి.. విశాఖకు మాత్రమే దిగుమతి చేసేలా కేంద్రం గతంలో నిర్ణయం తీసుకున్న వైనాన్ని అధికారులు చెబుతున్నారు.

వేర్వేరు దేశాల నుంచి ఈ ప్రమాదకర రసాయనం ఏటా 2.2 నుంచి 2.5 లక్షల టన్నుల వరకు దిగుమతి అవుతుందన్న విషయాన్ని తెలుసుకున్న వారంతా ఉలిక్కిపడుతున్నారు. కాలం.. ఖర్మం బాగున్నంత వరకు ఓకే కానీ.. ఏదైనా తేడా వస్తే పరిస్థితి ఏమిటన్న ఊహకే హడలిపోయే పరిస్థితి. అందునా.. బీరుట్ లో జరిగిన నష్టం చూసిన తర్వాత.. ఈ ప్రమాదకర రసాయనం వైజాగ్ పోర్టులో మాత్రమే వస్తుందన్న వార్త కొత్త ఆందోళనకు తెర తీస్తుంది.

Next Story