వైఎస్సార్ వారసురాలు షర్మిల మాత్రమే : రేవంత్ రెడ్డి
విశాఖ స్టీల్ కి వ్యతిరేకంగా APCC భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
By Medi Samrat Published on 16 March 2024 8:45 PM ISTవిశాఖ స్టీల్ కి వ్యతిరేకంగా APCC భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సభ ను చూస్తుంటే నేను విశాఖ లో ఉన్నట్లు లేదు.. నాకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సభ పెట్టినట్లు ఉందని అన్నారు. ఇక్కడకు వద్దాం అనుకున్నప్పుడు కాంగ్రెస్ ఏపీలో లేదు అని అన్నారు. అక్కడకు పోతే కాంగ్రెస్ పరువు పోతుంది ఏమో అని అన్నారు. నేను వైఎస్సార్ బిడ్డ షర్మిల సభ పెడితే ఎలా ఉటుందో చెప్పా. ఇక్కడ సభ చూస్తే షర్మిల న్యాయకత్వం ఎలా ఉందో అర్ధం అవుతుందన్నారు.
మనం భౌగోళికంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయాం. ఢిల్లీ నుంచి సుల్తాన్ లు, జగిర్ధార్ లు వచ్చినా.. విశాఖ ఉక్కు పెళ్ళ కూడా పెకిలించలేరన్నారు. ఆనాడు కురుక్షేత్రం లో కౌరవులు,పాండవులు వేరు వేరు.. కానీ వాళ్ళ మీదకు ఎవరైనా వస్తే అందరూ ఒకటయ్యే వారు. వైఎస్సార్ వారసులు ఎవరు అనేది అపోహలు,అనుమానాలు ఉండొచ్చు. వైఎస్సార్ సంకల్పాన్ని నిలబెట్టే వాళ్ళే నిజమైన వారసులన్నారు. వైఎస్సార్ ఆశయాలకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు వైఎస్సార్ వారసులు ఎలా అవుతారు ఆలోచన చేయాలన్నారు.
ఆంధ్ర ప్రాంతంలో ప్రశ్నించే గొంతులు లేవన్నారు. ఢిల్లీ నుంచి మోడీ ఆంధ్ర ను పాలిస్తున్నాడు అంటే ఇక్కడ ప్రశ్నించే గళం ఇంతవరకు లేదన్నారు. 10 ఏళ్లు అయినా పోలవరం కట్టలేదు.. 10 ఏళ్లు దాటినా రాజధాని కట్టలేదు.. తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టారన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి మన ఖ్యాతిని పెంచేలా ఢిల్లీని ఎందరో శాసించారన్నారు. ఇవాళ రెండు రాష్ట్రాల్లో నాయకులు ఢిల్లీలో వంగి వంగి దండాలు పెట్టే వాళ్ళే ఉన్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో వైఎస్సార్ ను రంగంలో దింపిందన్నారు. చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేశారు. 105 డిగ్రీల జ్వరం వచ్చినా పాదయాత్ర ను అపలేదన్నారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. 2004 లో కాంగ్రెస్ ను అధికారంలో తెచ్చారు. 33 మంది ఎంపీలను గెలిపించారని గుర్తుచేశారు. అనాడు వైఎస్సార్ మొక్క బోని దీక్ష తోనే ఇటు రాష్ట్రంలో,అటూ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిందన్నారు.
అధికారంలో వచ్చిన వెంటనే 12 వందల కోట్ల రూపాయల కరెంట్ బిల్లులను మాఫీ చేశారు. రాజీవ్ అరోగ్య శ్రీ పథకంతో అపోలో, యశోద లాంటి కార్పొరేట్ లో వైద్యం అందించారు. శ్రీమంతుల పిల్లలతో పోటీ పడేలా పేద బిడ్డలకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తీసుకు వచ్చారు. జలయజ్ఞం సృష్టికర్త వైఎస్సార్. పోలవరం,హంద్రీనీవా లాంటి ప్రాజెక్టులు జలయజ్ఞం పుణ్యమే.. హైదరాబాద్ అభివృద్ధి లో వైఎస్సార్ కీలక పాత్ర పోషించారని వివరించారు. ప్రాణహిత - చేవెళ్ల వైఎస్సార్ మొదలు పెట్టిన ప్రాజెక్ట్ అని వెల్లడించారు.
రాష్ట్రాలుగా విడిపోయాం.. తెలుగు బిడ్డలు గా కలిసి ఉండాలన్నారు. బీజేపీ అంటే ఇవ్వాళ బాబు, జగన్, పవన్ అన్నారు. వీళ్ళు మోడీ బలం, భలగం అని ఆరోపించారు. వీళ్లకు ఓటేస్తే మోడీకి ఓటు వేసినట్లేనన్నారు. ఢిల్లీలో మోడీ నీ నిలదీసే దమ్ము లేదన్నారు. అంతా ముత్యాల ముగ్గు బ్యాచ్ అని ఎద్దేవా చేశారు. బాబు, జగన్ కేవలం పాలన కోసమే.. రాష్ట్ర హక్కుల కోసం కోట్లాడే వాళ్ళు కాదన్నారు. ఈ రాష్ట్రానికి ప్రశ్నించే గొంతు కాంగ్రెస్.. షర్మిలమ్మ అన్ని ఆలోచనలు చేసి ఇక్కడకు వచ్చిందన్నారు. నన్ను అడిగింది.. నేను ఎందుకు అని అడిగిన.. అక్కడ ప్రజలు కష్టాల్లో ఉన్నారు..నేను నిర్ణయం తీసుకున్న అని చెప్పింది.. నాకు వయసు ఉంది.. శక్తి ఉంది.. వాళ్ళకోసం పోరాటం చేస్తా అని చెప్పింది.. వైఎస్సార్ బిడ్డగా, ఆయన వారసురాలుగా ఎక్కడ పోగొట్టుకున్నమో అక్కడ నుంచే మొదలు పెడతా అని చెప్పిందని వివరించారు.
ఆంధ్ర ప్రదేశ్ గడ్డ మీద జెండా పాతుతం అని చెప్పారు. షర్మిలమ్మకి ఇక్కడ అన్ని తెలుసు. ఇక్కడ ఉన్నవి అంబోతులు అని తెలుసు. అన్ని తెలిసే ఇక్కడ పోరాటం చేయాలని వచ్చింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా చూడటానికి వచ్చింది. అదానీ కోసం ప్రధాని తెగనమ్ముతుంటే పోరాటం చేయడానికి వచ్చింది. అప్పనంగా అధికారం కోసం షర్మిలమ్మ ఇక్కడకు రాలేదన్నారు. ఇక్కడ ప్రజలకు అండగా నిలబడేందుకు వచ్చింది. వైఎస్సార్ చివరి కోరిక.. రాహుల్ ప్రధాని అవ్వడమేనన్నారు.
వైఎస్సార్ ఏ రోజు బీజేపీతో అంట కాగలే.. బీజేపీ కి వైఎస్సార్ ఎప్పుడు బద్ద వ్యతిరేకి.. కష్టం వచ్చినా కాంగ్రెస్ పక్షాన వైఎస్సార్ నిలబడ్డాడు.. వైఎస్సార్ ఒక సెక్యులర్.. వారసులు అని చెప్పుకొనే వాళ్ళు ఇవాళ ఎవరి పక్కన నిలబడ్డాడనే ఆలోచన చేయాలన్నారు. ఎవరి ఆశయం కోసం కొట్లాడుతున్నారో చెప్పాలన్నారు. మోడీకి అండగా నిలబడి.. ఈ రాష్ట్రాన్ని ఒక కమ్యునల్ చేతుల్లో పెట్టాలని అనుకున్నారా..? అని ప్రశ్నించారు.
మణిపూర్‌లో అరాచకం జరుగుతుంటే వైఎస్సార్ వారసుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.. వైఎస్సార్ అంటే వైఎస్ షర్మిల.. వైఎస్సార్ వారసురాలు ఒక షర్మిల మాత్రమేనన్నారు. వైఎస్సార్ ఆశయాలు షర్మిలమ్మ దగ్గరే ఉన్నాయన్నారు. బాబుకి, జగన్ కి మోదీని ప్రశ్నించే దమ్ము లేదు.. రాష్ట్రానికి ప్రశ్నించే గొంతు వైఎస్ షర్మిల రెడ్డి.. మీ నిధులు మీకు తీసుకు వస్తుందని అన్నారు. రాష్ట్ర హక్కులు షర్మిలమ్మ తోనే సాధ్యమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కథం అని అన్నారు. అక్కడ ఉన్న కేడీ, ఢిల్లీలో ఉన్న మోడీని ఎదుర్కొన్న.. అప్పుడు నేను అధైర్య పడలేదు. 5 సీట్లు ఉన్న కాంగ్రెస్ కి 65 సీట్లు ఇచ్చి నిలబెట్టారు.. ఇక్కడ కాంగ్రెస్ ను నిలబెట్టేందుకు షర్మిలమ్మ పోరాటం చేస్తోంది. షర్మిలమ్మకి నేను అండగా నిలబడతా.. షర్మిలమ్మను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసే వరకు నేను అండగా ఉంటానన్నారు. ఏ అవసరం వచ్చినా ముందు ఉంటానన్నారు.