"మాకే త‌క్కువ మార్కులేస్తారా..? " అంటూ.. టీచర్‌ను చెట్టుకు కట్టేసి కొట్టిన విద్యార్థులు

Jharkhand Students tie their teacher to tree and beat them. విద్యార్థులంతా క‌లిసి ఉపాధ్యాయుడిని చెట్టుకు క‌ట్టేసి కొట్టారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Sept 2022 9:15 AM IST
మాకే త‌క్కువ మార్కులేస్తారా..?  అంటూ.. టీచర్‌ను చెట్టుకు కట్టేసి కొట్టిన విద్యార్థులు

సాధార‌ణంగా విద్యార్థుల‌కు త‌క్కువ మార్కులు వ‌స్తే ఉపాధ్యాయులు దండించ‌డం, ఇత‌ర శిక్ష‌లు వేయ‌డం లాంటివి మ‌నం చూసి లేదా అనుభ‌వించి ఉంటాం. అయితే.. ఇక్క‌డ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. త‌మ‌కు త‌క్కువ మార్కులు వేశార‌ని విద్యార్థులంతా క‌లిసి ఓ ఉపాధ్యాయుడిని, ఆన్‌లైన్‌లో న‌మోదు చేసిన క్ల‌ర్క్‌ను చెట్టుకు క‌ట్టేసి మ‌రీ కొట్టారు. ఈ ఘ‌ట‌న ఝార్ఖండ్ రాష్ట్రంలో జ‌రిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

వివ‌రాల్లోకి వెళితే.. దుమ్కా జిల్లాలోని ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో సుమ‌న్ కుమార్ అనే ఉపాధ్యాయుడు 9, 10వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు గ‌ణితం భోదిస్తున్నాడు. ఇటీవ‌ల ప్ర‌క‌టించిన ప‌రీక్షా ఫ‌లితాల్లో 32 మంది విద్యార్థుల్లో 11 మంది ఫెయిల్ అయ్యారు. త‌మ‌కు ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌ల్లో త‌క్కువ మార్కులు వేయ‌డం వ‌ల్లే తాము ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణ‌త సాధించ‌లేద‌ని విద్యార్థులు ఆరోపించారు. కావాల‌నే త‌మ‌ను స‌ద‌రు ఉపాధ్యాయుడు ఫెయిల్ చేశార‌ని ఆగ్ర‌హంతో ఊగిపోయారు.

దీంతో ఉపాధ్యాయుడితో పాటు ఆన్‌లైన్‌లో మార్కులు న‌మోదు చేసిన క్లర్క్‌ సోనేరామ్‌ చౌరే ల‌ను చెట్టుకు క‌ట్టేసి కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీనిపై ఉపాధ్యాయుడిని పోలీసుల‌కు ఫిర్యాదు చేయాల‌ని ప‌లువురు సూచించ‌గా.. విద్యార్థుల భ‌విష్య‌త్తును దృష్టిలో ఉంచుకుని అందుకు స‌ద‌రు ఉపాధ్యాయుడు నిరాక‌రించాడు. కాగా.. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ఫిర్యాదు అంద‌లేని స్థానిక పోలీసులు తెలిపారు. అయితే.. ప్రాక్టిక‌ల్ మార్కులు ఫ‌లితాల్లో న‌మోదుకావ‌ని అక్క‌డి ఉపాధ్యాయులు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. రూమ‌ర్ల ఆధారంగా విద్యార్థులు ఈదాడికి పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

Next Story