పాము.. ఈ పేరు చెబితే చాలు చాలా మంది వెన్నులో వణుకుపుడుతుంది. అల్లంత దూరానా పాము ఉందని తెలిసినా చాలు అటు చాయలకు కూడా వెళ్లరు. అలాందిటి ఓ నాగుపాము మనం పట్టుకున్న సంచిలో ఉందని తెలిస్తే ఏమవుతుంది..? మన గుండె జారీ గల్లంతు అయిపోవడం ఖాయం. ఓ విద్యార్థిని స్కూల్ బ్యాగులో నాగుపాము దర్శనమిచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
శివపురి జిల్లాలోని బదౌని పాఠశాలలో ఓ విద్యార్థిని పదో తరగతి చదువుతోంది. రోజులాగేనే బ్యాగ్ తీసుకుని పాఠశాలకు వచ్చింది. అయితే.. తరగతి గదిలో కూర్చున్న తరువాత పుస్తకం తీసేందుకు బ్యాగ్‌ను ఓపెన్ చేయగా.. నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది. దీంతో ఆ విద్యార్థిని బ్యాగు నుంచి దూరంగా పరిగెత్తింది. దీంతో ఒక్కసారిగా క్లాస్ రూమ్‌లో గందరగోళ వాతావరణం నెలకొంది. పాము ఉందని తెలుసుకున్న విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ఉపాధ్యాయులు కూడా భయపడ్డారు.
ఓ వ్యక్తి ధైర్యం చేసి బ్యాగ్‌ను క్లాస్ రూమ్ నుంచి ఖాళీ ప్రదేశంలోని తీసుకువచ్చాడు. నెమ్మదిగా బ్యాగులోంచి పుస్తకాలను బయటకు తీశాడు. ఆ పుస్తకాల మధ్యలోంచి పాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా.. పాము విద్యార్థిని ఇంటి వద్దనే బ్యాగులోకి వెళ్లి ఉంటుందని బావిస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.