Fact Check : స్కూటర్లు, మనుషులు కొట్టుకుని పోతున్న వీడియో ఇప్పటిదేనా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Oct 2020 11:13 AM GMT
Fact Check : స్కూటర్లు, మనుషులు కొట్టుకుని పోతున్న వీడియో ఇప్పటిదేనా..?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ మహా నగరం మీద వరుణుడు కుండపోత వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. చాలా ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. నగరానికి పశ్చిమంగా 50 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్టు అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు హైదరాబాద్ వాసులను తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగగా, పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపైకి నడుములోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలాప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. నగరంలో మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు.

ఇలాంటి సమయంలో సామాజిక మాధ్యమాల్లో నీట మునిగిన హైదరాబాద్ కు చెందిన ప్రాంతాలు అంటూ పలువూరు వీడియోలను షేర్ చేస్తూ ఉన్నారు. కొన్ని ఇప్పటివి కాగా.. ఇంకొన్ని ఎప్పటివో ఉన్నాయి. 'ఉస్మాన్ గంజ్' కు చెందిన వీడియో అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు. వర్షపు నీరు వేగంగా వెళుతూ ఉండగా.. అందులో కొన్ని స్కూటర్లు, మనుషులు కూడా కొట్టుకు పోవడాన్ని మనం గమనించవచ్చు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కొట్టుకుని వెళ్లకుండా ప్రయత్నాలు చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది.

హైదరాబాద్ లో భారీ వర్షం పడితే ఇదీ పరిస్థితి అని.. చట్ట విరుద్ధంగా కట్టిన కట్టడాల కారణంగా, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేనందువలన ఇలాంటి పరిస్థితి తలెత్తిందని సామాజిక మాధ్యమాల్లో చెబుతూ వస్తున్నారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న వీడియోలో ఎటువంటి నిజం లేదు.

ఈ వీడియో ఇప్పుడు వచ్చిన వర్షాలకు తీసినది కాదు. 2019 సెప్టెంబర్ నెలలో హైదరాబాద్ లో భారీ వర్షం వచ్చిన సమయంలో చోటు చేసుకున్న ఘటన ఇది. ఈ వీడియోను పలు మీడియా సంస్థలు పోస్టు చేశాయి.

సెప్టెంబర్ నెల 2019న పలు మీడియా సంస్థలు ఈ వీడియోను యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం గమనించవచ్చు.

2019 సెప్టెంబర్ నెలలో కూడా భాగ్యనగరాన్ని భారీ వర్షం అతలాకుతలం చేసింది. ఆ సమయంలో ఉస్మాన్ గంజ్, బేగం బజార్ ప్రాంతాలలో భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. గత 50 సంవత్సరాలుగా తాము ఇలాంటి దుస్థితిని ఎదుర్కొంటూ ఉన్నామని ఆ ప్రాంత వాసులు చెబుతూ ఉన్నారు. వర్షాకాలంలో ప్రతి ఏడాది భారీ వర్షం పడుతూ ఉంటుందని ఉస్మాన్ గంజ్ నాలాలు పొంగి పొర్లడం వలన మురుగు నీరు తమ ఇళ్లలోకి షాపుల్లోకి వచ్చి చేరుతూ ఉంటుందని వారు బాధపడుతూ చెప్పుకొచ్చారు.

News 18 Telugu కూడా ఈ వీడియోను షేర్ చేశారు. సెప్టెంబర్ 2019 లో ఈ ఘటన చోటు చేసుకుందని మనకు స్పష్టంగా తెలుస్తోంది. పంజాగుట్ట, బేగంపేట లాంటి ప్రాంతాల్లో 2019 సెప్టెంబర్ లో నీట మునిగిన సంగతి తెలిసిందే. ఈ వరదలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను పలు మీడియా సంస్థలు పోస్టు చేశాయి.

హైదరాబాద్ లో ఉస్మాన్ గంజ్ లో బైకులతో పాటూ మనుషులు కొట్టుకుపోయిన ఘటన అక్టోబర్ 2020 కి సంబంధించినది కాదు. వైరల్ అవుతున్న పోస్టులో ఎటువంటి నిజం లేదు.

Claim Review:Fact Check : స్కూటర్లు, మనుషులు కొట్టుకుని పోతున్న వీడియో ఇప్పటిదేనా..?
Claim Reviewed By:Satyapriya
Claim Fact Check:false
Next Story