గవర్నమెంట్ డబ్బుతో సీక్రెట్ బ్రిడ్జిని కట్టించాడు.. పోలీసులను చంపాక దాన్నే వాడాడు..!

By సుభాష్  Published on  10 July 2020 7:14 AM GMT
గవర్నమెంట్ డబ్బుతో సీక్రెట్ బ్రిడ్జిని కట్టించాడు.. పోలీసులను చంపాక దాన్నే వాడాడు..!

వికాస్ దూబేకు ఎంతో మంది సన్నిహితులు అటు రాజకీయ పార్టీల్లోనూ, పోలీసు డిపార్ట్మెంట్ లలోనూ ఉన్నారన్నది స్పష్టంగా తెలుస్తోంది. 60కి పైగా కేసులు ఉన్నప్పటికీ దర్జాగా బయటకు తిరిగాడు అంటే అతడి స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు వస్తున్నారంటే పారిపోయే గ్యాంగ్ స్టర్స్ ఉన్న ఈ కాలంలో దూబే మాటు వేసి మరీ పోలీసులను చంపేశాడు. శవాలను తగులబెట్టాలని కూడా అనుకున్నాడు. తప్పించుకుని తిరుగుతూ వెళ్లి.. వేరే రాష్ట్రంలో దొరికిపోయిన వికాస్ చివరికి కాన్పూర్ కు గంటలో చేరుకుంటున్న సమయంలో ఎన్ కౌంటర్ కు గురయ్యాడు.

వికాస్ దూబే ప్రభుత్వ నిధులను కూడా తన కోసమే వాడుకున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. తన చుట్టూ ఓ ఆర్మీ లాంటి దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నెట్ వర్క్ ను బాగా పెంచుకున్నాడు. ప్రభుత్వం రోడ్డు నిర్మాణానికి ఇచ్చిన డబ్బులో 12 లక్షల రూపాయలను ఒక సీక్రెట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కోసం వినియోగించాడట. వికాస్ దూబే భార్య రిచా జిల్లా పంచాయతీ మెంబర్ గా ఉన్న సమయంలో వచ్చిన నిధులను పండు నది మీద ఓ వంతెన నిర్మించడానికి ఉపయోగించాడు. పోలీసులు తనను పట్టుకోడానికి వస్తున్నారని తెలిసిన వెంటనే వికాస్ దూబే ఈ బ్రిడ్జిని వాడుకుని పారిపోయాడు. ఎనిమిది మంది పోలీసులను చంపిన తర్వాత ఇక అక్కడే ఉంటే పోలీసులు తనను ఎన్ కౌంటర్ చేస్తారని భావించిన వికాస్ తాను నిర్మించుకున్న ఆ సీక్రెట్ బ్రిడ్జి మీద నుండే పండు నదిని దాటి వెళ్ళిపోయాడు. పండు నది మీద నిర్మించిన ఈ బ్రిడ్జి ద్వారా శివ్లీ ప్రాంతానికి చేరుకున్నాడు వికాస్ దూబే. కొన్ని గంటల పాటూ సెర్చ్ చేస్తే కానీ పోలీసులు ఈ బ్రిడ్జిని కనిపెట్టలేకపోయారు. తన ఇంటి నుండి ఎన్నో మార్గాలను కూడా వికాస్ దూబే బిక్రూ గ్రామంలో ఏర్పాటు చేసుకున్నాడు. చిన్నపాటి బంకర్ ను కూడా వికాస్ దూబే కట్టుకున్నాడంటే ఎంత ముందుచూపుతో ఆలోచించాడో అర్థం చేసుకోవచ్చు.

పోలీసులు ఎప్పుడు తనను అరెస్ట్ చేయడానికి వచ్చినా బంకర్ లోకి వెళ్లి అక్కడి నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లే విధంగా ఏర్పాట్లను చేసుకున్నాడని స్థానిక వ్యక్తి చెప్పుకొచ్చాడు. పోలీసులు వికాస్ దూబేను అతడి ఇంట్లో అరెస్ట్ చేయడం అసాధ్యం అని గ్రామస్థులు ముందు నుండి నమ్మేవారు. గత కొన్నేళ్లలో పోలీసులు వికాస్ దూబే ఇంట్లో ఉన్నాడని అరెస్ట్ చేయడానికి రావడం.. అతడు కనిపించకుండా పోవడం లాంటి ఘటనలు జరిగేవని గ్రామానికి చెందిన మరొక వ్యక్తి తెలిపాడు. సీక్రెట్ గా ఏర్పాటు చేసిన ఎగ్జిట్ పాయింట్ల వలన అతడు చాలా సులువుగా తప్పించుకునే వాడని తెలుస్తోంది. ఎంతో మంది నమ్మకస్థులు దూబే చుట్టూ ఉండేవాళ్లు. పోలీసులు వస్తున్నారన్న సమాచారం తెలియగానే పల్లెకు అడ్డుగా రాళ్లను, చెట్లను పెట్టేసే వారు. అలా చేయడం ద్వారా వికాస్ దూబే తప్పించుకోవడానికి సమయం దొరికేది.

వికాస్‌ దూబేను శుక్రవారం ఉదయం పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో దూబే హతమైనట్లు యూపీ పోలీసులు అధికారికంగా వెల్లడించారు. గురువారం ఉజ్జయిని మహాంకాళి దేవాలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లగా, పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. ఈ క్రమంలో వికాస్‌ దూబేను కాన్పూర్‌కు వాహనంలో తరలిస్తుండగా, వారి వాహనం బోల్తాపింది. అదే అదనుగా భావించిన గ్యాంగ్‌స్టర్‌ దూబే పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కోని పారిపోతూ కాల్పులు జరిపేందుకు ప్రయత్నించగా, అప్రమత్తమైన పోలీసులు దూబేను ఎన్‌ కౌంటర్‌ చేశారు.

Next Story
Share it