వికాస్ దూబే మరణంపై అతడి కుటుంబ సభ్యుల నుండి ఊహించని స్పందన

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 July 2020 2:34 PM GMT
వికాస్ దూబే మరణంపై అతడి కుటుంబ సభ్యుల నుండి ఊహించని స్పందన

వికాస్ దూబే ఎన్ కౌంటర్ విషయంలో ఎన్నో ప్రశ్నలు వెంటాడుతూ ఉన్నప్పటికీ పోలీసులకు అభినందనలు మాత్రం లభిస్తూనే ఉన్నాయి. నరరూప రాక్షసుడిని అంతం చేసి మంచి పని చేశారని పలువురు అభినందిస్తూ ఉన్నారు. వికాస్ దూబే మరణం వెనుక రాజకీయ కోణాలు కూడా ఉన్నాయని చెప్పే వాళ్లు చాలా మందే ఉన్నారు. పటిష్ట బందోబస్తు మధ్య వికాస్ దూబే అంత్యక్రియలు కాన్పూర్ లోని భైరవ్ ఘాట్ లో నిర్వహించగా, భార్య, చిన్న కుమారుడు, బావమరిది దినేశ్ తివారీ తప్ప ఇతర కుటుంబ సభ్యులెవరూ హాజరుకాలేదు. వికాస్ దూబే మరణంపై అతడి భార్య, తండ్రి స్పందించారు.

తన భర్తను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం సబబేనని వికాస్ దూబే భార్య రిచా చెప్పుకొచ్చింది. తన భర్త ఘోరానికి పాల్పడ్డాడని, ఇలాంటి శిక్షకు అర్హుడేనని ఏడుస్తూ తెలిపింది. వికాస్ దూబే తండ్రి రామ్ కుమార్ దూబే సైతం కుమారుడి అంత్యక్రియలకు హాజరు కాలేదు. తన కుమారుడు ఎనిమిది మంది పోలీసులను చంపడం ఘోరమైన నేరమని.. తమ మాట ఎప్పుడూ వినలేదని, పెద్దల మాట వినుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. వికాస్ దూబే కారణంగా తమ పూర్వీకుల ఆస్తి మొత్తం హరించుకుపోయిందని, ఈ శిక్ష సరైనదేనని అన్నారు. నేర ప్రవృత్తిని ఎంచుకున్నవాళ్లకు ఈ ఎన్ కౌంటర్ ఓ కనువిప్పు కావాలని రామ్ కుమార్ దూబే అన్నారు.

వికాస్‌ దూబేను శుక్రవారం ఉదయం పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో దూబే హతమైనట్లు యూపీ పోలీసులు అధికారికంగా వెల్లడించారు. గురువారం ఉజ్జయిని మహాంకాళి దేవాలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లగా, పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. ఈ క్రమంలో వికాస్‌ దూబేను కాన్పూర్‌కు వాహనంలో తరలిస్తుండగా, వారి వాహనం బోల్తాపడింది. పోలీసు దగ్గర నుండి గన్ లాక్కుని పారిపోతూ ఉండగా.. పోలీసులు లొంగిపొమ్మని చెప్పినా కూడా వికాస్ దూబే వినకపోవడంతో అతడిని పోలీసులు కాల్చి చంపారు. ఎనిమిది మంది పోలీసులను వికాస్ గ్యాంగ్ హత్య చేయడంతో ఐదు రోజుల్లో వికాస్ గ్యాంగ్ లోని పలువురిని కాల్చి చంపారు పోలీసులు.

కాన్పూర్ ఆసుపత్రిలో వికాస్ దూబే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ప్రక్రియను వీడియోలో బంధించారు. అతడి మృతదేహంలో నాలుగు బుల్లెట్ గాయాలు ఉన్నట్టు గుర్తించారు. వికాస్ దూబే చనిపోయాడని తెలియగానే అతడి గ్రామమైన బిక్రూలో సంబరాలు జరుపుకున్నారు.

ఇక వికాస్ దూబే అనుచరులను పట్టుకోవడంలో నిమగ్నమైన పోలీసులకు దూబే సన్నిహితుడైన దయాశంకర్ అగ్నిహోత్రికి చెందిన రేషన్ షాపు లో ఏడు నాటు బాంబులు దొరికాయి. దూబే ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో యూపీ పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేశారు. దూబే ముఠా సభ్యులైన ఓం ప్రకాశ్ పాండే, అనిల్ పాండేలు గ్వాలియర్‌లోని రహస్య స్థావరంలో దాక్కున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకున్నారు. పోలీసులను చంపిన సమయంలో అక్కడ ఉన్న వికాస్ దూబే అనుచరులందరినీ ఉత్తరప్రదేశ్ పోలీసులు పట్టుకోవడం కానీ.. కాల్చి చంపాలని కానీ డిసైడ్ అయ్యారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. దీంతో వికాస్ దూబే గ్యాంగ్ కు చెందిన వారు పారిపోవడం లేదా లొంగిపోవాలని భావిస్తూ ఉన్నారు.

Next Story
Share it