వానొస్తే అంతే.. అక్క‌డ అడుగు బ‌య‌ట‌పెట్ట‌లేం.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 July 2020 2:05 PM GMT
వానొస్తే అంతే.. అక్క‌డ అడుగు బ‌య‌ట‌పెట్ట‌లేం.!

విజ‌య‌వాడ న‌గ‌రంలోని ప‌లు ఏరియాల్లో రోడ్ల‌‌‌ ప‌రిస్థితి మ‌రింత దారుణంగా త‌యార‌య్యింది. వానొస్తే చాలు.. అడుగు బ‌య‌టపెట్టలేని దుస్థితి. ప్ర‌భుత్వాలు మారుతున్నా రోడ్లు‌ ఎటువంటి అభివృద్దికి నోచుకోక‌‌పోవ‌డంతో స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్యంగా న‌గ‌రంలోని క‌రెన్సీ న‌గ‌ర్‌.. ఓం న‌మః శివాయ వీధిలో వ‌ర్ష‌మొస్తే చాలు.. కాలు బ‌య‌ట‌పెట్ట‌లేని ప‌రిస్థితి. రోడ్ల‌పై వాగుల‌ను త‌ల‌పించేలా నీరు ఆగి.. ముఖ్యంగా ఆడ‌వాళ్లు, చిన్న‌పిల్ల‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.

గ‌త ఎడేళ్లుగా వ‌ర్ష‌కాలంలో ఆ కాల‌నీ వాసులు ప‌డే ఇబ్బందులు అన్నీ, ఇన్నీ కావు. ఎన్నికల వేళ నాయ‌కులు రోడ్లు వేస్తామ‌ని హామీల మీద హామీలు గుప్పిస్తూ.. ఎన్నిక‌ల అనంత‌రం కాల‌నీ వాసుల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం ప‌ట్ల కాల‌నీ వాసులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న తూర్పు నియోజ‌క‌వ‌ర్గం కింద‌కి వ‌స్తుంది ఈ క‌రెన్సీ న‌గ‌ర్. గ‌త వారం నియోజ‌క‌వ‌ర్గంలోని కొన్ని ప్రాంతాల‌లో ప‌ర్య‌టించిన ఆయ‌న‌.. గడిచిన టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన అభివృద్ధి పనులకు వైసీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదని.. దాని వల్ల కాంట్రాక్టర్లు పనులు చేయలేక పోతున్నారని అన్నారు. రహదారుల సమస్య పరిష్కారించే విధంగా సంబంధిత మునిసిపల్ అధికారులతో మాట్లాడటం జరిగిందని, రోడ్లు మరమ్మతులకు త్వ‌ర‌లోనే పనులు ప్రారంభించే విధంగా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని చెప్పారు.

ఇదిలావుంటే.. సంవ‌త్స‌రం క్రితం వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వంపై నింద‌లు మోపుతున్నార‌ని.. ఐదేళ్లు టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు మీరేం చేశార‌ని స్థానికులు ప్ర‌శ్నిస్తున్నారు. గ‌త ప్ర‌భుత్వంలోనే కాల‌నీలో రోడ్ల‌కు మ‌హ‌ర్థ‌శ ప‌డుతుంద‌ని అనుకున్నామ‌ని.. అప్ప‌టి టీడీపీ ప్ర‌భుత్వంకు చెందిన‌ మంత్రి గారు ఓ వీధిలో ఉన్నార‌ని.. కేవ‌లం ఆ వీధి వ‌ర‌కూ మ‌త్ర‌మే రోడ్డు వేసి మ‌మ అనిపించారని.. అప్ప‌టి నుండి నాయ‌కుల‌కు ఎన్నిసార్లు మొర‌పెట్టుకున్నా ప‌ట్టించుకునే నాథుడే లేడంటూ స్థానికులు వాపోతున్నారు.

Next Story
Share it