ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకం అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. కేబినెట్ మీటింగ్ అనంతరం రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పార్థసారధి కేబినెట్ నిర్ణయాలను ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు జమ చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్న దాత సుఖీభవ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. పోలవరం డయాఫ్రం వాల్ వెంటనే ప్రారంభించాలని కేబినెట్‌లో నిర్ణయించారు. రాష్ట్రంలోని మత్స్యకారులకు మత్స్యకార భరోసా అమలు చేయాలని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయల రేషనలైజేషన్ ప్రక్రియకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు. మూడు కేటగిరీలుగా సచివాలయాలు, ఉద్యోగులను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. 2,500 జనాభా కంటే తక్కువ ఉన్న సచివాలయం పరిధిలో ఆరుగురు ఉద్యోగులు, 2500-3500 వరకూ జనాభా ఉన్న సచివాలయంలో ఏడుగురు ఉద్యోగులు, 3500 జనాభా కంటే ఎక్కువ ఉన్న చోట్ల ఎనిమిది మంది ఉద్యోగులను కేటాయించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వృద్ధి రేటు, ఆదాయం పెంపుపైనా కేబినెట్‌లో చర్చ జరిగిందన్న ఆయన, 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధన కోసం సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారని స్పష్టం చేశారు.