అసెంబ్లీ వేదికగా చంద్రబాబుపై సీఎం వైఎస్ జగన్ కౌంటర్లు
CM Jagan Comments On Chandrababu. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు
By Medi Samrat Published on 26 Nov 2021 10:15 AM GMTఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ నీచ రాజకీయానికి తెరలేపారని విమర్శించారు. నేను గాల్లోనే వచ్చి గాల్లోనే పోతానని.. శాశ్వతంగా కనుమరుగైపోతానని ప్రతిపక్ష నేత అన్నారని.. చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారం అని వైఎస్ జగన్ అన్నారు. వరద సహాయక చర్యలు ఆగకూడదనే నేను వెళ్లలేదు. సీనియర్ అధికారుల సూచనల మేరకే ఆగిపోయానన్నారు. నేను వెళ్లడం కన్నా బాధితులకు సహాయం అందడం ముఖ్యమని అన్నారు. జిల్లాకొక సీనియర్ అధికారిని పంపామని.. మంత్రులు, ఎమ్మెల్యేలను అక్కడే ఉండమన్నామన్నారు. నేను ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించానని.. సహాయక చర్యల తర్వాత కచ్చితంగా పర్యటిస్తానని అన్నారు.
వానలు రాయలసీమను ముంచెత్తడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని.. అక్కడ అనూహ్య వరదలు సంభవించాయని అన్నారు వైఎస్ జగన్. కొన్ని చోట్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగిందని.. నష్టం వివరాలు ఎక్కడా దాచిపెట్టడం లేదని తెలిపారు. సహాయం అందించడంలో ఎక్కడా వెనకడుగు వేయలేదని.. రిజర్వాయర్ల భద్రత పర్యవేక్షణకు సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో వరదలు వస్తే చంద్రబాబు ఏ ఒక్కరిని ఆదుకోలేదు. ప్రభుత్వాన్ని ఎలా డ్యామేజ్ చేయాలన్నదే ఈనాడు పత్రికల్లో రాస్తారని చెబుతూ పేపర్ ప్రకటన గురించి ప్రస్తావించారు వైఎస్ జగన్. వరద ముంపు ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని.. మృతుల కుటుంబాలకు తక్షణ పరిహారంగా రూ.5లక్షలు అందించామన్నారు.
నాయకుడు అనేవాడికి.. ప్రజలకు జరగాల్సిన మంచి సరైన పద్దతిలో, అందరికి అందుతుందా లేదా అనేది తెలుసుకోవడం ముఖ్యమని సీఎం జగన్ అన్నారు. బాధితుల దగ్గరకు వెళ్లి డ్రామాలు చేయడం కాదని.. లీడర్ అంటే అక్కడకు వెళ్లి పనులు సరైన పద్దతిలో జరుగుతున్నాయా లేదా పరిశీలించాలన్నారు. ఈ సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో అధికారులు నాకు స్పష్టంగా అర్థం అయ్యేలా చెప్పారని.. ముఖ్యమంత్రి వస్తున్నారని.. అందుకోసం ఏర్పాట్లు చేయడంలో జిల్లా యంత్రాంగం అంత బిజీ అవుతారని అన్నారు. ఫలితంగా సహాయక చర్యలు, కార్యక్రమాలు ఆగిపోయి.. సీఎం చుట్టూ జిల్లా యంత్రాంగం, మీడియా, హడావుడి తప్ప పనులు జరగవు అని సీనియర్ అధికారులు నాకు తెలిపారని జగన్ చెప్పుకొచ్చారు. వారి మాటలు వాస్తవమని అనిపించాయని.. అందుకే నాకు వెళ్లాలని ఉన్నా.. కూడా వెళ్లలేదని అన్నారు.