రాజధాని అమరావతికి మళ్లీ ప్రాణప్రతిష్ట చేశాం
‘అమరావతి రాజధానికి మళ్లీ ప్రాణప్రతిష్ట చేశాం. వారసత్వంగా వచ్చిన భూములను భవిష్యత్ తరాల కోసం ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు
By Medi Samrat Published on 19 Oct 2024 1:10 PM GMTఅమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు...కానీ రూ.లక్ష కోట్లవుతాయని పదేపదే గత పాలకుల అబద్ధాలు.
రాష్ట్రాభివృద్ధి కోసమే విజన్ 2047... 420లకు నా విజన్ అర్థంకాదు
విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం...
కర్నూలులో హైకోర్టు బెంచ్, పరిశ్రమలు ఏర్పాటుతో అభివృద్ధి చేస్తాం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
అమరావతిలో రాజధాని పున:నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం
‘అమరావతి రాజధానికి మళ్లీ ప్రాణప్రతిష్ట చేశాం. వారసత్వంగా వచ్చిన భూములను భవిష్యత్ తరాల కోసం ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు, అమరావతి నిర్మాణం కోసం నేను ఒక్క పిలుపిస్తే 34,241 ఎకరాలను 29,881 మంది రైతులు ఇచ్చారు. ప్రపంచంలోనే నెంబర్ వన్ ల్యాండ్ పూలింగ్ చేసిన ఘనత మనదే. రాష్ట్రం కోసం రైతులు భూములు ఇస్తే, గడిచిన ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టింది. రాణీరుద్రమ దేవిలా మహిళలు పోరాడారు. మీరు పడ్డ కష్టాలు చూశాను. నేను కూడా జోలెపట్టి మీ కోసం పోరాడాను. అమరావతి రైతులను గత ప్రభుత్వం అడుగడుగునా అణగదొక్కింది. న్యాయస్థానం నుంచి దేవస్థానం కార్యక్రమం చేపడితే అన్నం తిన్నివ్వలేదు. అడగడుగునా వేధించారు. ఈ పవిత్రమైన పుణ్యభూమిని శక్తి కాపాడింది. నాడు సాక్షాత్తు ప్రధాన మంత్రితో శంకుస్థాపన చేశాం. అన్ని దేవాలయాల నుంచి పవిత్ర జలాలు, మట్టి తెచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసి పునీతం చేశాం. ఎంతమంది రాక్షసులు వచ్చినా అమరావతిని కాపాడిన చరిత్ర రైతులదే’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి రాజధానిలో నిర్మాణ పనులు ముఖ్యమంత్రి శనివారం పున:ప్రారంభించారు. రాయపూడి వద్ద జీ ప్లస్ 7 విధానంలో నిర్మించ తలపెట్టిన సీఆర్డీయే కార్యాలయం గత ప్రభుత్వంలో నిలిచిపోయింది. దాని నిర్మాణ పూర్తి చేసేందుకు పనులు ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ..
ఆర్థిక రాజధానిగా విశాఖ...కర్నూలులో హైకోర్ట్ బెంచ్
రాష్ట్ర విభజన సమయంలో కనీసం మనకు రాజధాని కూడా లేదు. ఈ ఆఫీస్ ను సెక్రటేరియట్ గా భావించి పని చేశాం. కొత్తం రాష్ట్రం అనేక సమస్యలు ఉన్నాయి...16 శాతం లోటు బడ్జెట్ తో పాలన ప్రారంభించాం. ఉద్యోగులను కూడా హైదరాబాద్ నుండి రెండేళ్లలోనే అమరావతికి తీసుకొచ్చాం. రాళ్లు రప్పలున్న హైదరాబాద్ ప్రాంతంలో సైబరాబాద్ నగరాన్ని నిర్మించాం. దేశంలోనే నెంబర్ సిటీగా హైదరాబాద్ ను తీర్చిదిద్దాం. ఎవరూ ఊహించని రోజుల్లోనే 8 లైన్ల ఔటర్ రింగ్ రోడ్ నిర్మించాం. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు 5 వేల ఎకరాలు ఇస్తామంటే విమర్శించారు. ఈనాటి కోసం కాదు భవిష్యత్ కోసమని ఆలోచించాం. ఇప్పుడు అమరావతిలో రూ.160 కోట్లతో జీ ప్లస్ 7 భవనం నిర్మిస్తున్నాం. 121వ రోజున ఈ భవనాన్ని ప్రారంబిస్తాం. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. రాష్ట్రానికి మధ్యలో ఉండే ప్రాంతం.. అమరావతి. ఒక రాష్ట్రం, ఒక రాజధాని అని... రాష్ట్రంలో ప్రతిచోటా చెప్పా. విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని చెప్పాను. అమరావతే రాజధాని అని విశాఖ, కర్నూలు వాసులతో ఒప్పించాను. కర్నూలులో హైకోర్టు బెంచ్, పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తాం. ఇటీవల మేం మళ్ళీ అధికారంలోకి వచ్చేసరికి అప్పులు తప్ప ఏమీ కనిపించలేదు. మీ పిల్లల భవిష్యత్ బాగుండాలి. రైతులకు కౌలు పెండింగ్ నిధులు 170 కోట్లు ఇచ్చాం...రూ.225 కోట్లు త్వరలో ఇస్తాం. భూమిలేని వ్యవసాయ కూలీలకు పెన్షన్ అందిస్తున్నాం.‘ అని అన్నారు.
లక్ష కోట్టు ఖర్చు అంటూ తప్పుడు ప్రచారం
‘రాజధాని నిర్మాణానికి రూ.లక్ష కోట్లు అవుతాయని.. తమవద్ద డబ్బులేదని ఐదేళ్లపాటు కాలయాపన చేశారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ సిటీ అని గతంలోనే చెప్పా. హైదరాబాద్ లో కూడా డబ్బులు ఖర్చు పెట్టలేదు...భూమి ఇచ్చి నీళ్లు ఇచ్చాం. దీంతో అక్కడ సంపద సృష్టి జరిగింది. ప్రభుత్వ డబ్బు అవసరం లేకుండా అమరావతి అభివృద్ధి చేస్తాం. ఉపాధికి కేంద్రం...పేద ప్రజలకు భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి అమరావతి గని లాంటిది. అలాంటి అమరావతిని పట్టుకుని స్మశానం, ఎడారి, మునిగిపోయిందని మాట్లాడుతున్నారు. చెన్నై, హైదరాబాద్ నీళ్లొచ్చాయి. జగన్ కట్టుకున్న యలహంక ప్యాలెస్ లోకి నీళ్ల వచ్చాయి. ఒకరు చెడిపోవాలని కోరుకుంటే భగవంతుడు కూడా క్షమించడు. అమరావతికి ఎంతో పవిత్రత ఉంది..ఇది దేవతల రాజధాని. కొత్త రాజధానికి అమరావతి పేరు బాగుంటుందని ఆనాడు రామోజీరావు చెప్పారు. అమరావతికి విట్, ఎస్ ఆర్ ఎం, అమృత్ వర్సిటీలు వచ్చాయి. ఎక్స్ఎల్ఆర్ఐ యూనివర్సిటీ కూడా వస్తుంది. లా స్కూలు కూడా ఏర్పాటవుతుంది. దేశంలో టాప్-10 విద్యాసంస్థల బ్రాంచ్ లు ఇక్కడికి రావాలి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అమరావతి మీదుగా బుల్లెట్ రైలు కావాలని కేంద్రాన్ని అడిగా. అమరావతికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు అంగీకరించింది. అనుకున్న సమయంలోగా పనులన్నీ పూర్తి చేయాలని కోరుతున్నా. అమరావతిలో నిర్మాణ పనులు జెడ్ స్పీడ్ గా జరుగుతున్నాయి. అమరావతిలో గ్రీన్ ఎనర్జీ మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకుంటాం. ఈవీ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం. వాకింగ్ ట్రాక్, సైకిలింగ్ ట్రాక్ లు ఏర్పాటు చేస్తాం. రాజధానిలో తలపెట్టిన పనులన్నీ మూడేళ్లలో పూర్తి కావాలి. ప్రజలు గెలవాలి...రాష్ట్రం అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చా. మరో రెండువారాల్లో పోలవరం పనులు పునఃప్రారంభం అవుతాయి. గత పాలకులు రోడ్లు కూడా తవ్వేశారు.’ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుందర నగరంగా అమరావతి నిర్మాణం
‘వంశధార, గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తాం. 1631 రోజులు పాటు రాజధానిని కాపాడుకోవడం కోసం రైతులు ఉద్యమం చేశారు. విధ్వంసం పోయింది...నిర్మాణం ప్రారంభమైంది. విధ్వంసం శాశ్వతం కాదు...అరాచకం శాశ్వతం కాదు...మనం చేసే మంచి పనులే శాశ్వతం. దేశ చరిత్రలో అమరావతి ఒక్కటే సుందరంగా ఉంటుంది. గత పాలకులు చేసిన విధ్వంసంతో నిలిచిన పనుల వల్ల రూ.7 వేల కోట్లు అదనంగా భారం పడుతోంది. రూ.52 వేల కోట్లతో పనులు ప్రారంభిస్తాం. కేంద్రం రూ.15 వేల కోట్లు అందించేందుకు ముందుకొచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆల్ ఇండియా అధికారులు, న్యాయమూర్తుల కోసం రెసిడెన్షియల్ టవర్స్ పూర్తి చేస్తాం. అనుకున్న సమయానికి నిర్మాణాలు పూర్తి చేస్తాం. 8,603 కి.మీ సీఆర్డీయే, 217 చ.కిమీ పరిధిలో రాజధాని ఉంటుంది. 16.9 చ.కి పరిధిలో కోర్ కేపిటల్ ఉంటుంది. ఇదంతా అభివృద్ధి చేసేందుకు అమరావతి ప్రాంతంలో 183 కి.మీ.తో ఓఆర్ఆర్ వస్తుంది. దేశంలో ఏపీ నెంబర్ వన్ గా ఉండాలన్నది నా కల. కష్టాలు చూసి పారిపోయేవాడిని కాదు. రాష్ట్రంలో అభివృద్ధిని పట్టాలెక్కిస్తున్నాం. ఇందులో అమరావతిని ప్రారంభించాం. పోలవరం 72 శాతం పూర్తి చేస్తే...వాళ్లొచ్చాక డయాఫ్రం వాల్ దెబ్బతీశారు. గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తాం. రాష్ట్ర భవిష్యత్తుకు 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. 2000 సంవత్సరం కంటే ముందు విజన్ 2020 అంటే ఎగతాళి చేసి 420 అన్నారు. కానీ విమర్శించిన వాళ్లే 420 లు అయ్యారు. నా విజన్ ఏంటో 420 లకు అర్థం కాదు...తెలీదు. ప్రపంచంలోనే తెలుగువారు అగ్రగామిగా ఉండాలన్నది నా ధ్యేయం. మీ ఆదాయాలు పెంచుతాం. ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామిక వేత్త రావాలి. ఒకప్పుడు థింక్ గ్లోబల్...యాక్ట్ లోకల్....ఇప్పుడు థింగ్ గ్లోబల్...యాక్ట్ గ్లోబల్ గా ఉండాలి. గత ఐదేళ్లు ఏ రాక్షసుడు ఎప్పుడు వస్తాడో తెలియక ప్రజలు భయంతో బతికారు, కానీ ఇప్పుడు ప్రజలు స్వేచ్ఛగా, ఆనందంగా ఉన్నారు. ప్రజలు ఇచ్చిన గెలుపుతో రాష్ట్ర పరపతి పెరిగింది. టీడీపీ, జనసే, బీజేపీ కలిసి పోటీ చేశాయి...మేం ఆలోచించింది కేవలం రాష్ట్రాన్ని పరిరక్షించుకోవాలని. రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. నా రాజకీయ జీవితంలో చూడని విజయాన్ని ప్రజలు ఇచ్చారు. రాష్ట్రం నుండి భూతం పోయిందని ఏమరపాటుగా ఉండకుండా ఆ భూతాన్ని శాశ్వతంగా దూరం చేయాలి.’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.