Fact Check : గాంధీ ఆసుపత్రిలోకి కోతులు ప్రవేశించాయా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 July 2020 5:04 PM ISTదేశంలో రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. ఇక కొన్ని కొన్ని చోట్ల ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు కూడా లేవంటూ వార్తలు వస్తున్నాయి. పేషెంట్స్ బెడ్స్ కోసం కొన్ని గంటల పాటూ ఆసుపత్రుల్లో ఎదురుచూస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో కోతులు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి లోకి ప్రవేశించాయంటూ వాట్సప్ లో వీడియో వైరల్ అవుతోంది.
దేశంలో ఆసుపత్రుల పరిస్థితి ఇలా ఉందంటూ పలువురు పోస్టులు పెడుతూ ఉన్నారు. “Right behind Gandhi Hospital is Padmarao Nagar. The day is not far when this colony will fall prey to Covid due to lack of government incompetence in controlling these dangerous carriers,” అంటూ వీడియోను పోస్టు చేశారు.
గాంధీ ఆసుపత్రికి దగ్గరలోనే పద్మారావు నగర్ ఉందని.. ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే కాలనీ మొత్తం కరోనా బారిన పడే అవకాశం ఉందని ఆ మెసేజీలో చెప్పుకొచ్చారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ వీడియోను వైరల్ చేయడం మొదలుపెట్టారు.
నిజ నిర్ధారణ:
పద్మారావు నగర్ లో చాలా ఆసుపత్రులు ఉన్నాయి. అక్కడ ఉన్న అతి పెద్ద ఆసుపత్రి గాంధీ ఆసుపత్రి. కోవిద్-19 పేషెంట్స్ ను చేర్చుకుంటోంది కేవలం గాంధీ ఆసుపత్రిలో మాత్రమే..!
న్యూస్ మీటర్ ఈ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ లోనూ యాండెక్స్ లోనూ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఆ వీడియో 'దక్షిణాఫ్రికాకు చెందినది'.. భారత్ లో చోటుచేసుకున్న ఘటన కాదు.
కోతులు ఆసుపత్రిలోని వార్డుల్లోకి ప్రవేశించి.. రోగుల దగ్గర ఉన్న తినుబండారాలను కొట్టేశాయట. AFP ఫ్యాక్ట్ చెక్ కూడా ఈ ఘటన సౌత్ ఆఫ్రికాలో చోటుచేసుకుందని కథనాన్ని ప్రచురించింది. డర్బన్ లో కట్టిన ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఆర్కె ఖాన్ ఆసుపత్రి వార్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికాలో కరోనా పేషెంట్స్ ట్రీట్మెంట్ కోసం తొమ్మిది ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చారు. ఆ ఆసుపత్రుల లిస్టులో ఆర్కె ఖాన్ ఆసుపత్రి లేదు.
ఆసుపత్రి లోకి కోతులు ప్రవేశించిన వీడియో ఫిబ్రవరి 2019న చోటుచేసుకుంది. లోకల్ మీడియా కూడా ఈ ఘటన మీద కథనాలను ప్రచురించింది. మాజీ హెల్త్ మినిస్టర్ డాక్టర్ ఆరోన్ మొత్సోవాలేది కోతులను తరిమేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోమని సూచించారు.
dailymail.co.uk కథనం ప్రకారం ఆర్కె ఖాన్ ఆసుపత్రిని అప్పట్లో కోతులు బాగా టార్గెట్ చేసేవి. తెరచి ఉన్న కిటికీలలో నుండి లోపలికి వచ్చి రోగులను భయబ్రాంతులకు గురి చేసి వారి దగ్గర ఉన్న తిండి పదార్థాలను కొట్టేసేవి. కొందరు రోగులు భయపడి బెడ్ కవర్స్ లో తిండిని దాచుకునే వారు.. తమనేమీ చేయకుండా బెడ్ షీట్స్ కప్పుకునే వారు. వార్డుల్లో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ కనిపించేవి.
ఈ వీడియోను ఇంకొందరు ‘Monkeys in a hospital in India with COVID-19 patients’ అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడం మొదలుపెట్టారు. Factly.com కూడా ఈ ఘటన సౌత్ ఆఫ్రికాలోని డర్బన్ లో చోటుచేసుకుందని తేల్చి చెప్పింది. అది కూడా 2019లో చోటుచేసుకున్న ఘటన.
ఆసుపత్రుల్లో కోతులు ప్రవేశించిన ఘటన ఇటీవల హైదరాబాద్ లో చోటుచేసుకున్నది కాదు. 2019లో దక్షిణాఫ్రికా లోని డర్బన్ లో చోటుచేసుకున్నది. ఈ వీడియోకు భారత్ కు ఎటువంటి సంబంధం లేదు. కరోనా వైరస్ సోకిన సమయంలో తీసిన వీడియో కూడా కాదు. కాబట్టి ఈ వీడియోపై ప్రస్తుతం వైరల్ అవుతున్న వదంతులు 'పచ్చి అబద్ధం'.