యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
By సుభాష్ Published on 26 Aug 2020 12:36 PM ISTఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లకి వెళితే.. లక్నో-హర్దోయ్ రహదారిపై బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా, గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో రెండు బస్సుల డ్రైవర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఒక బస్సు లక్నో నుంచి హర్దోయ్‌కి.. మరో బస్సు హర్దోయ్ నుంచి లక్నోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్ నవీన్ ఆరోరా తెలిపారు. విషయం తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.
అటు ఉత్తరప్రదేశ్ రోడ్‌వేస్ సైతం ఈ ఘటనపై స్పందించింది. ప్రమాదంపై దర్యాప్తు కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి 24 గంటల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కాగా, బస్సు డ్రైవర్ల అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.