అనంతపురం: ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

By సుభాష్  Published on  26 Aug 2020 4:48 AM GMT
అనంతపురం: ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోట చేసుకుంది. కోవిడ్‌ వార్డులో పక్కనే ఉన్న రికార్డు గదిలో మంగళవారం అర్ధరాత్రి షార్ట్‌ సర్య్కూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అధికారులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ప్రమాదం సంభవించడంతో అప్రమత్తమైన అధికారులు 24 మంది కరోనా పేషెంట్లను మరో వార్డులోకి తరలించారు. జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాదం కారణంగా కేవలం రికార్డు రూమ్‌లోని కొన్ని పుస్తకాలు, పాత ఎక్స్‌రేలు దగ్దమైనట్లు తెలుస్తోంది.

కాగా, ఈ మధ్యన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. షార్ట్‌ సర్య్కూట్‌ కారణం, ఇతర కారణాలతో ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలతో ఎంతో మంది కోవిడ్‌ బాధితులు మృత్యువాత పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి.

Next Story