బిగ్‌బ్రేకింగ్: ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి.. వాహనంలో ఇరుక్కున్న మృతదేహాలు
By సుభాష్ Published on 5 Jun 2020 10:24 AM IST
ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ప్రతాప్‌గఢ్ జిల్లాలోని వాజిద్‌పూర్‌లో స్కార్పియో - ట్రక్కు ఢీకొనడంతో 9 మంది మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. మృతుల్లో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. వీరంతా హర్యానా నుంచి బీహార్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో మృతులంతా స్కార్పియోలోనే ఇరుక్కుపోవడంతో వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కట్టర్ల సహాయంతో కత్తిరించి మృతదేహాలను బయటకు తీశారు.
అలాగే ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులంతా బీహార్‌లోని భోజ్‌పూర్‌కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిథ్యనాథ్ మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. గాయాలైన వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.