యోగి సర్కార్ సంచలన నిర్ణయం.. ఆరు నెలల పాటు ఎస్మా ప్రయోగం
By సుభాష్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సంచనాలకు మారుపేరు. ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనమే ఉంటుంది. ప్రజా సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ అధికారులను సైతం ఉరుకులు పరుగులు పెట్టిస్తూ గుండెల్లో రైళ్లు పరుగెత్తించేలా చేస్తారు. పానలన పరంగా అన్ని సంచలన నిర్ణయాలే తీసుకుంటారని యోగికి పేరుంది. ఇక తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆరునెలల పాటు రాష్ట్రంలో అత్యవసర సేవల నిర్వహణ చట్టాన్ని (ఎస్మా) ప్రయోగిస్తున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్పష్టం చేశారు. ఇందుకు గవర్నర్ ఆనందీబెన్‌పటేల్ కూడా అనుమతి ఇవ్వడంతో రాష్ట్ర అదనపు కార్యదర్శి ముకుల్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఎస్మా చట్టం అమలులో ఉండటం వల్ల అన్ని ప్రభుత్వ శాఖలలో పని చేసే ఉద్యోగులు ఆరు నెలల పాటు సమ్మె చేసేందుకు వీలు లేకుండా నిషేధం కొనసాగుతోంది. అలా కాదని ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే ఏడాది పాటు జైలు, లేదా వెయ్యి రూపాయల జరిమానా,లేదా ఒక్కోసారి రెండు శిక్షలను విధించే అవకాశం ఉంటుందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి నిసనలు ఎదుర్కొనే అవకాశం ఉండటంతో యోగి సర్కార్ ఈ చట్టాన్ని అమలులోకి తెచ్చినట్లు తెలుస్తోంది.