వరంగల్‌: బావిలో మృతదేహాల మిస్టరీ: రంగంలోకి దిగిన కేంద్ర హోంశాఖ

By సుభాష్  Published on  24 May 2020 6:22 AM GMT
వరంగల్‌: బావిలో మృతదేహాల మిస్టరీ: రంగంలోకి దిగిన కేంద్ర హోంశాఖ

వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెలకుంట బావిలో బయటపడ్డ 9 మంది మృతదేహాల మిస్టరీని చేధించేందుకు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే పోస్టుమార్టం రిపోర్టులు, ఫోరెన్సిక్‌ రిపోర్టులు వచ్చాయి. మరో రెండు రిపోర్టులు రావాల్సి ఉంది. అయితే బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఏం జరిగిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ మృతదేహాల మిస్టరీ కొద్దికొద్దిగా వీడుతోంది. ఫోరెన్సిక్‌ ప్రాథమిక నివేదికలో ఈ మృతదేహాలకు సంబంధించి మరిన్ని నిజాలు బయటపడుతున్నాయి.

కాగా, 9 మంది వలస కార్మికులది హత్యగా పోలీసులు ఒక నిర్దారణకు వచ్చారు. వీరిని ఎవరు చంపేసి బావిలో పడేశారని ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ 9 మంది మృతదేహాల మిస్టరీపై కేంద్ర హోంశాఖ కూడా ఆరా తీస్తోంది. ఇంత మంది ఒకే బావిలో చనిపోవడంపై ఇంకా మిస్టరీగానే ఉంది. ఈ మేరకు సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఎస్పీ, ఇద్దరు ఇన్స్‌పెక్టర్లు గొర్రెలకుంటలోని బావిని పరిశీలించారు. 9 మంది ప్రాణాలతో ఉండగానే బావిలోపడి చనిపోయినట్లు ఫోరెన్సిక్‌ ప్రాథమిక నివేదికలో వెల్లడైంది.

లభ్యమైన రెండు మోబైల్స్‌

ఈ నేపథ్యంలో పోలీసులు వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందులో ఒకరు బుస్రా ప్రియుడు యాకూబ్‌ కాగా, మరో ఇద్దరు బీహార్‌ చెందిన కార్మికులు ఉన్నారు. యాకూబ్‌ శుక్రవారమే అదుపులోకి తీసుకోగా, శనివారం బీహార్‌కు చెందిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇక ప్రత్యేక దర్యాప్తు బృందాలకు రెండు సెల్‌ఫోన్లు లభ్యమైనట్లు తెలుస్తోంది. రెండు సెల్‌ ఫోన్‌లలో ఒక టి మక్సూద్‌ది కాగా, మరొకటి బుస్రాదిగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ రెండు సెల్‌ఫోన్‌ల కాల్‌ డేటా వివరాలను పరిశీలిస్తున్నారు. అయితే మక్సూద్‌ సెల్‌ఫోన్‌ వరంగల్‌ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో స్విచ్ఛాఫ్‌ అయినట్లు తెలుస్తోంది. వర్ధన్నపేట మండలం నందనం వద్ద సెల్‌ సిగ్నల్‌ ట్రేస్‌ చేసినట్లు సమాచారం.

ఇక ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శనివారం గొర్రెలకుంటలోని మృతదేహాలు లభ్యమైన బావి వద్ద పలు కోణాల్లో పరిశోధన జరిపారు. ముగ్గురు అనుమానితులతో ఘటన స్థలంలో సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ తరహాలో పరిశీలించారు. అంతేకాకుండా బీహార్‌కు చెందిన ఇద్దరు యువకులు ఉండే గదిని సైతం డీసీపీ వెంకటలక్ష్మీ నేతృత్వంలో పోలీసల బృందాలు పరిశీలించాయి. సుమారు గంట పాటు గొర్రెల కుంటలోనే పరిశీలించారు. మరోవైపు ఈ కేసును దర్యాప్తు పకగ్బందీగా జరపాలని వరంగల్‌ పోలీసు కమిషనర్‌ను హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ ఆదేశించారు.

ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల చనిపోయారు

బావిలో తేలిన 9 మంది మృతదేహాలపై ఫోరెన్సిక్‌ రిపోర్టులు పలు నిజాలు బయటపడ్డాయి. వారంతా బావిలో పడే ముందు బతికే ఉన్నారని, 9 మంది కూడా ఉపిరితిత్తుల్లోకి నీరు చేరడం వల్లే చనిపోయారని వరంగల్‌ ఎంజీఎం మార్చురీ ఫోరెన్సిక్‌ విభాగం హెడ్‌ డాక్టరర్‌ రజామాలిక్‌ తెలిపారు. బావిలోనే తుది శ్వాస విడిచినట్లు తెలిపారు. వారి నమూనాలను సైతం సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిస్తామని, వారిపై ఫుడ్‌ పాయిజన్‌ జరిగిందా. లేదా అనేది తేలాలంటే ఫోరెన్సిక్‌ నివేదిక రావాల్సి ఉందన్నారు.

నలుగురి ఒంటిపై గాయాలు

నలుగురి మృతదేహాల ఒంటిపై గాయాలు ఉన్నాయని నివేదికలో స్పష్టమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో సెల్‌ఫోన్‌ సంభాషణలు, కాల్‌డేలా కీలకంగా మారాయి. బుస్రా, ఆమెతో వివాహేతర సంబంధం ఉందని అనుమానిస్తున్న యాకూబ్‌ ఫోన్‌ కాల్‌ డేటాతో పాటు ఇరులతో మాక్సూత్‌ ఏం మాట్లాడాడనే విషయాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

బెంగాల్‌ నుంచి రానున్న మక్సూద్‌ బంధువులు

కాగా, 9 మంది మృతదేహాలు కూడా వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి మార్చురిలోనే ఉన్నాయి. శనివారమే ఖననం చేస్తారని భావించినా.. మక్సూద్‌ బంధువులు పశ్చిమబెంగాల్‌ నుంచి వస్తున్నారనే సమాచారంతో మార్చురీలో భద్రపరిచినట్లు అధికారులు చెబుతున్నారు. బీహార్‌కు చెందిన ఇద్దరిని వరంగల్‌ పోతన స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించాలని, మిగతా ఏడు మృతదేహాలను వరంగల్‌ ఖబరస్తాన్‌లో ఖననం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Next Story
Share it