వరంగల్‌: బావిలో మృతదేహాల మిస్టరీ: ఫోరెన్సిక్‌ రిపోర్టులో సంచలన నిజాలు..!

By సుభాష్  Published on  23 May 2020 2:19 PM GMT
వరంగల్‌: బావిలో మృతదేహాల మిస్టరీ: ఫోరెన్సిక్‌ రిపోర్టులో సంచలన నిజాలు..!

తెలంగాణలోని వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెలకుంట బావిలో బయటపడ్డ 9 మంది మృతదేహాల మిస్టరీని చేధించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. బుధవారం రాత్రి 9 గంటల గంటల ప్రాంతంలో ఏం జరిగిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ మృతదేహాల మిస్టరీ వీడుతోంది. ఫోరెన్సిక్‌ ప్రాథమిక నివేదికలో ఈ మృతదేహాలకు సంబంధించి మరిన్ని నిజాలు బయటపడుతున్నాయి. బావిలో నుంచి బయటకు తీసిన 9 శవాలను పోస్ట్‌ మార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. శవాలన్నింటికి శనివారం పోస్టుమార్టం పూర్తయ్యాయి. కాగా, పోలీసుల ప్రాథమిక నివేదిక ఆధారంగా అందరిని తోసేసి చంపేశారా..?అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Warangal Dead Bodies Report2

అయితే పోస్ట్‌ మార్టంలో రెండు మృతదేహాల్లో మాత్రం ఊపిరితిత్తుల్లో నీళ్లు కనిపించలేదని నివేదికలో తేలింది. మత్తులో ఉన్న సమయంలోనే ఈడ్చుకొచ్చి బావిలో పడేసి ఉంటారని నివేదికల ఆధారంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను ఈడ్చుకొచ్చినట్లుగా వారి శరీరంపై ఆనవాళ్లు ఉన్నట్లు ప్రాథమిక నివేదికలో స్పష్టమైనట్లు తెలుస్తోంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న మూడు సెల్‌ఫోన్లలోని కాల్‌డేలాను పరిశీలిస్తున్నారు.

ఈ కేసుకు సంబంధించిన పది పోలీసు బృందాలు లోతుగా దర్యాప్తు జరుపుతున్నాయి. మరోసారి బావిలో దిగి ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అన్ని నివేదికలను జోడించాకే ఏం జరిగిందో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. కాగా, మరో రెండు ఫోరెన్సిక్‌ నివేదికలు రావాల్సి ఉంది.

కాగా, మక్సూద్‌ కుటుంబం పశ్చిమబెంగాల్ నుంచి వరంగల్‌లోని కరీమాబాద్‌కు 20 ఏళ్ల క్రితం వలస వచ్చింది. గొర్రెలకుంటలోని గోనెసంచీల ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. కాగా, లాక్‌డౌన్‌ కారణంగా కరీమాబాద్‌ నుంచి రావడం ఇబ్బందిగా ఉండటంతో మక్సూద్‌ కుటుంబం ఫ్యాక్టరీలోనే ఉంటోంది. ఇక అదే ఆవరణలో శ్యామ్‌, శ్రీరామ్‌ అనే బీహార్‌కు చెందిన యువకులు ఉంటున్నారు. బుధవారం రోజు మక్సూద్‌ కుటుంబం కనిపించకుండా పోవడంతో ఫ్యాక్టరీ యజమాని సంతోష్ చుట్టుపక్కల గాలించగా, ఓ బావిలో శవాలు కనిపించాయి.

Warangal Dead Bodies Report1

ముందుగా నాలుగు శవాలు బయటపడగా, తర్వాత మరో ఐదు మృతదేహాలు బయటపడ్డాయి. శ్యామ్‌, శ్రీరామ్‌ యువకులతో పాటు మక్సూద్‌ ఇద్దరు కుమారుల శవాలు బయటపడ్డాయి. ఈ ఘటనపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మక్సూద్‌ కూతురు బుస్రా వరంగల్‌లోని ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Next Story
Share it