అత్యవసరం అయితే తప్ప.. మరో ఆరు రోజులు బయటికి రావద్దు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 May 2020 4:38 AM GMT
అత్యవసరం అయితే తప్ప.. మరో ఆరు రోజులు బయటికి రావద్దు

ఓ వైపు కరోనా వైరస్ రెండు తెలుగు రాష్ట్రాలను అత‌లాకుత‌లం చేస్తుంటే.. మ‌రోవైపు భ‌గ‌భ‌గ మండే ఎండ‌లు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కొద్దిరోజులుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో ఎండలు నిప్పుల కుంప‌టిని త‌ల‌పిస్తున్నాయి. రెండు నెల‌లుగా ఇంటికే ప‌రిమిత‌మ‌యిన‌ ప్ర‌జానీకం.. లాక్‌డౌన్ ప‌డ‌లింపుల‌తో అడుగు బ‌య‌ట‌పెడ‌దామంటే.. వడగాలులకు వ‌ణుకుతున్నారు.

ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ.. ఏపీ ప్ర‌జ‌ల‌కు హెచ్చరికలు జారీ చేసింది. మరో ఆరు రోజుల పాటు.. అత్యవసరమైతే తప్పా బయటికి రావద్దని హెచ్చ‌రించింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉన్నందున ఎవ‌రిని అడుగు బ‌య‌ట పెట్టొద్ద‌ని సూచించింది.

ఈ నెల 28 వరకు భానుడి ప్ర‌తాపం ఇలానే ఉంటుంద‌న్న వాతావ‌ర‌ణ శాఖ‌.. ఏపీలో ముఖ్యంగా.. కర్నూలు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు తీవ్రంగా ఉంటాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. 29 నుండి వాతావ‌ర‌ణంలో మార్పులు సంభ‌విస్తాయ‌ని.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.

Next Story
Share it